అక్షరటుడే, కామారెడ్డి: Gambling Crackdown | ఒకప్పుడు సరదా కోసం మొదలయ్యే ఆట, క్రమంగా వ్యసనంగా మారి మనిషి జీవితాన్ని, కుటుంబాన్ని, భవిష్యత్తును ఎలా నాశనం చేస్తుందో కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న ఎన్నో సంఘటనలు కళ్లకు కడుతున్నాయి.
కష్టపడకుండా ఒక్క రాత్రిలో ధనవంతులు కావాలనే అత్యాశతో ఎంతో మంది జూదం వైపు అడుగులు వేస్తున్నారు. మొదట్లో చిన్న మొత్తంతో మొదలయ్యే ఈ ఆట, తర్వాత అప్పులు, కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడి వరకు దారితీస్తోంది.
Gambling Crackdown | సంపాదించిన సొమ్మును..
సంపాదించిన సొమ్మును పోగొట్టుకోవడమే కాకుండా, ఉన్న ఆస్తిని, నమ్మకాన్ని, గౌరవాన్ని కూడా కోల్పోతున్నారు. చివరికి ఒంటరితనం, అవమానం మాత్రమే మిగులుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో జూదం, పేకాటను సమూలంగా నిర్మూలించాలని జిల్లా పోలీసు శాఖ నిర్ణయించింది. ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) ఆదేశాలతో నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు 24 గంటల పాటు జిల్లావ్యాప్తంగా అప్రమత్తంగా ఉంటూ జూదం జరిగే ప్రాంతాలపై నిరంతర నిఘా ఉంచనున్నాయి.
Gambling Crackdown | జూదాన్ని అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు
జిల్లాలో జూదం, పేకాటను పూర్తిగా అరికట్టేందుకు ఎస్పీ రాజేష్ చంద్ర నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు 24 గంటల పాటు జిల్లావ్యాప్తంగా జూదం జరిగే ప్రాంతాలపై నిఘా ఉంచుతాయి. ముందస్తు సమాచారం సేకరించి, జూదం జరుగుతున్నట్లు తెలియగానే ఆకస్మిక దాడులు నిర్వహించి నిర్వాహకులతో పాటు పాల్గొన్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాయి.
Gambling Crackdown | అత్యాశతో జీవితాలు నాశనం
కష్టపడకుండా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో కొందరు జూదానికి అలవాటు పడుతున్నారు. జూదంలో గెలిచి సులభంగా డబ్బు వస్తుందనే భ్రమతో కష్టపడి సంపాదించిన సొమ్మును కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ వ్యసనం కారణంగా కుటుంబాల్లో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. జూదం సంపాదనకు మార్గం కాదని తెలిసినా అదే దారిలో వెళ్తున్నారు.
Gambling Crackdown | ప్రత్యేక అడ్డాల ఏర్పాటు
జిల్లాలో ఇటీవల జూదం, పేకాట స్థావరాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. కూలీనాలి చేసుకునే వ్యక్తి నుంచి మొదలుకుని ఉద్యోగుల వరకు దీనికి బానిసలవుతున్నారు. ఈ ఆటను క్యాష్ చేసుకునేందుకు కొందరు ప్రత్యేక అడ్డాలను ఏర్పాటు చేస్తున్నారు. శివారు గ్రామాల్లో ఫార్మ్హౌస్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అందులో సకల వసతులు కల్పిస్తున్నారు. పోలీసులు దాడులకు వస్తున్న సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేక వ్యక్తులను కూడా నియమించుకున్నట్టుగా సమాచారం. ఫలితంగా శివారు ప్రాంతాలు పేకాట స్థావరాలకు అడ్డాగా మారుతున్నాయి.
Gambling Crackdown | సమాచారం ఇవ్వాలంటున్న పోలీసులు
జిల్లాలో ఎక్కడైనా జూదం, పేకాట జరుగుతున్నట్లు గుర్తించినా, సమాచారం తెలిసినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూ నంబర్ 8712686133కు సమాచారం అందించాలని పోలీసు శాఖ పేర్కొంది. సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇస్తోంది. జూదం నిర్మూలనలో ప్రజలు కూడా భాగస్వాములై పోలీసులకు సహకరించాలని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తోంది. అయితే ఈ విధానం ఎంతవరకు ఫలితాన్నిస్తుందో వేచి చూడాలి.
Gambling Crackdown | భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు – రాజేష్ చంద్ర, ఎస్పీ కామారెడ్డి
యువత క్షణిక ఆశలకులోనై జూదానికి బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. జూదం, పేకాట కేసుల్లో పట్టుబడితే ఆ వివరాలు పోలీసు రికార్డుల్లో నమోదవడంతో పాటు వేలిముద్రలు సేకరించి భద్రపరుస్తారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు జరిగే పోలీసు వెరిఫికేషన్లో ఈ కేసులు పరిశీలనకు వచ్చి ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడుతుంది.
ఇది కూడా చదవండి..: Weather Update | రాష్ట్రానికి భారీ వర్ష సూచన