అక్షరటుడే, డిచ్పల్లి: Online Gaming Addiction | కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మార్ కాలనీ చెందిన ఓ యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి రూ.12 లక్షలు అప్పు చేసి, అవి తీర్చే మార్గంలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లా (Nizamabad District) డిచ్పల్లి మండలంలోని ఓ గిరిజన తండాకు చెందిన విద్యార్థి అత్యాశకు పోయి ఆన్లైన్లో డబ్బులు పెట్టి మోసపోయాడు. ఇంట్లో తెలిస్తే తిడతారనే భయంతో బలవన్మరణం చెందాడు.. ఇలా ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాడు పడ్డ యువకులు చివరికి అప్పులపాలై జీవితాలు బుగ్గిపాలు చేసుకుంటున్నారు.
Online Gaming Addiction | స్మార్ట్‌ఫోన్ చేతిలోకి వచ్చాక..
స్మార్ట్‌ఫోన్ చేతిలోకి వచ్చాక ప్రపంచం మొత్తం అరచేతిలోకి వచ్చేసింది. సమాచారం, వినోదం, ఉపాధి అవకాశాలు, సామాజిక సంబంధాలు.. ఇలా అన్నీ ఒకే స్క్రీన్‌లో అందుబాటులోకి వచ్చేశాయి. అయితే ఇదే సాంకేతికత కొంతమంది యువతను మానసిక ఒత్తిడికి, ఆత్మన్యూనతకు, ఒంటరితంలోకి నెట్టేస్తున్నాయి. దీనికి తోడు గేమింగ్ యాప్‌లు యువతను ఆకర్షిస్తూ ఉచ్చులోకి దించుతున్నాయి.
Online Gaming Addiction | ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి జిల్లాలో ఇటీవల పెరుగుతున్న ఆత్మహత్యా యత్నాలు, యువతలో మానసిక ఆందోళనలు తీవ్రంగా కలచివేస్తున్నాయి. డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన అనేక మంది యువకులు ఉద్యోగాల కోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఆలస్యం కావడం, ప్రైవేటు రంగంలో తగిన అవకాశాలు లేకపోవడంతో చాలామంది యువత నిరాశకు గురవుతున్నారు. ఇదే క్రమంలో రోజంతా ఇంట్లోనే ఉండడంతో మొబైల్ ఫోన్, సోషల్ మీడియా, గేమింగ్‌లలో ఎక్కువ సమయం గడపడం అలవాటుగా మారిపోయింది.
Online Gaming Addiction | సోషల్ మీడియాతో ఒత్తిడికి లోనై..
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి వేదికల్లో ఇతరుల విజయాలు, విలాసవంతమైన జీవనశైలి చూసి అనేక మంది యువత తమ జీవితాలను వారితో పోల్చుకుంటున్నారు. దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువగా సంపాదించాలనే ఆలోచనతో ఫోన్లలో ఉండే ఆన్‌లైన్ గేమ్‌లను ఎంచుకుంటున్నారు. మొదటగా వచ్చే కొద్దిపాటి రాబడికి అలవాటు పడి మరింత డబ్బును వాటిలో పెట్టి మోసపోతున్నారు.
Online Gaming Addiction | గేమింగ్ ఒక్కటే కారణమా..?
ఆన్‌లైన్ గేమింగ్ (Online Gaming)తోనే కొంతమంది యువత వ్యసనానికి గురవుతున్నప్పటికీ.. అది సమస్యలో ఒక భాగం మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగ భద్రత లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులు, సామాజిక ఒత్తిళ్లు కలిసొచ్చినప్పుడు యువత మానసికంగా బలహీనపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. దీంతో వారి చేతుల్లో ఉండే ఫోన్‌తోనే వారు డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఆన్‌లైన్ గేమ్‌లలోకి దిగుతున్నారు.
Online Gaming Addiction | పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అవగాహన..
అమాయక యువత ఇలా గేమింగ్ యాప్‌ల ద్వారా ఆర్థికంగా ఇబ్బందుల పాలు కావొద్దని పోలీస్‌శాఖ ఆధ్వర్యంలోనూ అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఆర్థికంగా నష్టపోయిన యువత ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఇంట్లో కుటుంబీలకు చెప్పి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని పేర్కొంటుంది. అలాగే ఆయా విద్యాసంస్థల్లోనూ విద్యార్థులకు గేమింగ్, బెట్టింగ్ యాప్‌లతో కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. అలాగే భవిష్యత్తుల్లో కెరీర్ కౌన్సెలింగ్, మానసిక ఆరోగ్య శిబిరాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అందుబాటులోకి వస్తే యువతలో ఆత్మవిశ్వాసం పెరిగి, జీవితంపై సానుకూల దృక్పథం ఏర్పడే అవకాశం ఉంటుంది. యువతను గేమింగ్‌కు దూరం చేయడంతో పాటు.. వారి ఆశయాలకు దారి చూపిస్తే వారు వారు వందశాతం విజయాల బాట పడతారని పలువురు పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి..: Corporate School Fees | కార్పొరేట్ బడుల మాయాజాలం.. అడ్డగోలుగా ఫీజుల వసూలు