Pension Application Bribery | పింఛన్​ కోసం పైసలియ్యాల్సిందే..కామారెడ్డి బల్దియాలో వసూళ్ల పర్వం..!

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆసరా పింఛన్ల దరఖాస్తులను అర్హులైన లబ్ధిదారుల నుంచి స్వీకరిస్తోంది. మున్సిపల్, పంచాయతీ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Pension Application Bribery | రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆసరా పింఛన్ల దరఖాస్తులను అర్హులైన లబ్ధిదారుల నుంచి స్వీకరిస్తోంది. మున్సిపల్, పంచాయతీ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. గత నాలుగేళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు లేక ఎదురుచూస్తున్న లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు పెద్ద ఎత్తున కార్యాలయాలకు వెళ్తున్నారు. అయితే అక్రమార్కులకు ఈ ప్రక్రియ లాభాలను తెచ్చిపెడుతోంది.

కామారెడ్డి (Kamareddy) బల్దియాలో పలు వార్డులకు సంబంధించిన లబ్ధిదారులు పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. దరఖాస్తుల స్వీకరణ కోసం కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. అయితే దరఖాస్తు ఆన్​లైన్​ చేసే సమయంలో సంబంధిత ఫోన్ నంబరుకు ఓటీపీ వస్తే చెప్పాల్సి ఉండగా ఇందుకోసం కొందరు ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ఫోన్ చేయించి ఓటీపీ తీసుకుని వసూళ్లకు తెరలేపినట్టుగా ప్రచారం సాగుతోంది.

Pension Application Bribery | పింఛన్ దరఖాస్తుల నుంచి వసూళ్లు..

లబ్ధిదారుల అవసరాన్ని ఆసరా చేసుకుని బల్దియాలో వసూళ్ల పర్వం కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆసరా పింఛన్ దరఖాస్తులకు రూ. వెయ్యి నుంచి 2 వేల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉచితంగా జరగాల్సిన దరఖాస్తు ప్రక్రియకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. గత నాలుగేళ్లుగా పింఛన్ కోసం ఎదురుచూస్తున్న పేదల నుంచి ఇలా వసూలు చేయడం దారుణమని అంటున్నారు.

Pension Application Bribery | ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సిబ్బందే వసూళ్లు..?

దరఖాస్తు ఆన్​లైన్​ చేసే సమయంలో సంబంధిత ఫోన్ నంబరుకు ఓటీపీ వస్తే చెప్పాల్సి ఉండగా, ఇందుకోసం కొందరు ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ఫోన్ చేయించి ఓటీపీ తీసుకునే విధానాన్ని తెరపైకి తెచ్చారన్న ప్రచారం సాగుతోంది. ఈ ఓటీపీ ప్రక్రియను అడ్డుపెట్టుకుని ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సిబ్బందే వసూళ్లు చేయిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నేరుగా సిబ్బంది కాకుండా మధ్యవర్తులను పెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Pension Application Bribery | బల్దియా సిబ్బందిపై అనుమానాలు

ప్రైవేట్ వ్యక్తులతో వసూళ్లు చేయిస్తున్న వ్యవహారంతో కామారెడ్డి మున్సిపాలిటీలో సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగంలోనే ఈ వసూళ్లు జరుగుతున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బల్దియాలో జరుగుతున్న ఈ వసూళ్ల పర్వంపై విచారణ జరపాలని డిమాండ్ వినిపిస్తోంది.

Pension Application Bribery | ముఖ్య నాయకులు, అధికారుల పేర్లతో వసూళ్లు

వసూళ్లకు పాల్పడుతున్న రాయుళ్లు తమకు ముఖ్య నాయకులు, అధికారులు తెలుసని చెప్తున్నట్టు సమాచారం. పలుకుబడి ఉన్న వారి పేర్లు చెప్పి లబ్ధిదారుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు, నాయకుల అండతోనే ఇంత బహిరంగంగా వసూళ్లు చేస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Pension Application Bribery | వసూళ్లు చేస్తున్న వ్యక్తి నిలదీత

ఇదిలా ఉండగా తాజాగా వసూళ్లు చేస్తున్న వ్యక్తిని పలువురు స్థానికులు నిలదీసినట్టు తెలిసింది. పట్టణంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో కొంతమంది వద్ద ఒక్కొక్కరి వద్ద రూ.వెయ్యి నుంచి రెండు వేలు వసూలు చేసినట్టుగా సమాచారం. ఓటీపీ చెప్పాలంటూ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న వ్యక్తిని పట్టుకుని స్థానికులు ప్రశ్నించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో బల్దియాలో జరుగుతున్న వసూళ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి దొరికినా తనకు ఫలానా వ్యక్తులు తెలుసని చెప్పడం గమనార్హం. దాంతో స్థానికులు అతడిని పోలీసులకు అప్పగించినట్టుగా సమాచారం.

Pension Application Bribery | విచారణ జరిపేనా..?

కామారెడ్డి బల్దియాలో జరుగుతున్న ఈ వసూళ్ల పర్వంపై ఉన్నతాధికారులకు తెలుసా లేదా అనేది తెలియాల్సి ఉంది. సామాన్య ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న అధికారులు దృష్టి సారించకపోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుదారుల ద్వారా పూర్తిస్థాయిలో విచారణ జరిపితే ఎంతమంది వద్ద వసూళ్లు చేశారు.. ఈ వసూళ్ల వెనక ఉన్నదెవరు అనేది తెలిసే అవకాశం ఉంది. దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి..: Gampa Govardhan Criticism | వెయ్యి రోజుల పాలనలో రేవంత్ రెడ్డి విఫలం: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *