BRS Urea Protest | కొత్త ఊపులో గులాబీదళం.. యూరియా పోరుతో క్షేత్రబాట

ఉమ్మడిజిల్లాలో గులాబీ శ్రేణులు రైతు కష్టాలను భుజానికెత్తుకున్నాయి. యూరియా కొరతపై ఆందోళనలు చేస్తున్నాయి.

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: BRS Urea Protest | గులాబీ శ్రేణులు తాజాగా రైతు కష్టాలను భుజానికెత్తుకున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో (Nizamabad) కొంతకాలంగా సైలెంట్​గా ఉంటున్న బీఆర్ఎస్(BRS Party) మళ్లీ కదం తొక్కుతోంది. యూరియా కొరతతో అల్లాడుతున్న అన్నదాతలకు తోడుగా నిలిచి, ప్రభుత్వ వైఫల్యాలపై సమరానికి సిద్ధమైంది. రైతులకు అండగా బీఆర్ఎస్ క్యాడర్ రోడ్లపైకి వస్తోంది. యూరియా యాప్​పై సమర శంఖం పూరిస్తోంది.

BRS Urea Protest | గత అసెంబ్లీ ఎన్నికల్లో..

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బాల్కొండ(Balkonda), బాన్సువాడ మినహా ఎక్కడా బీఆర్ఎస్ జెండా ఎగరలేదు. కామారెడ్డిలో స్వయంగా కేసీఆర్ పోటీ చేసినా ఫలితం దక్కలేదు. అయితే బాన్సువాడలో గెలిచిన పోచారం తర్వాత కాంగ్రెస్​లో చేరారు. అప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలు నామమాత్రమయ్యాయనే విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం మళ్లీ యాక్టివ్ కావడంతో బీఆర్ఎస్​లో కొత్త జోష్ కనిపిస్తోంది.

BRS Urea Protest | యూరియా పోరుతో..

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న యూరియా సంక్షోభం బీఆర్ఎస్‌కు అవకాశంగా మారింది. ‘యూరియా యాప్’ పేరుతో రైతులను ఆన్‌లైన్‌ చుట్టూ తిప్పుతున్నారని, గత ప్రభుత్వ హయాంలో ఇంటికే ఎరువులు వచ్చేవని గుర్తుచేస్తూ నేతలు జనంలోకి వెళ్తున్నారు. రైతులతో కలిసి రోడ్లపై నిరసనలకు ప్లాన్ చేస్తున్నారు. రైతులకు తామున్నామనే భరోసా కల్పించే ప్రయత్నం చేస్తోంది. దాంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ కాంగ్రెస్ పై సమరశంఖం పూరిస్తోందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. గురువారం ఉమ్మడిజిల్లాలో భారీ ఎత్తున బీఆర్​ఎస్​ నిరసనలకు దిగింది. అటు ఎల్లారెడ్డిలో(Yellareddy) నియోజకవర్గ ఇన్​ఛార్జి నల్లమడుగు సురేందర్​ రోడ్డెక్కి యూరియా యాప్​కు వ్యతిరేకంగా ధర్నా చేశారు. మరోవైపు బాల్కొండలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేమల ప్రశాంత్​రెడ్డి సైతం జాతీయ రహదారిపై కార్యకర్తలు, రైతులతో కలిసి నిరసన తెలిపారు.

BRS Urea Protest | గత బీఆర్​ఎస్​ పాలనను వివరిస్తూ..

ప్రస్తుత ప్రభుత్వ పాలనలో, తమ ప్రభుత్వ పాలనలో రైతులకు కలిగిన ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో రైతులకు వివరించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు నేరుగా రైతుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకునే కార్యక్రమానికి రూపకల్పన చేశారు. గతంలో ఎలాంటి కొరత లేకుండా యూరియా సరఫరా చేసిన విషయాన్ని రైతులకు గుర్తు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై సైతం నాటి ప్రభుత్వం తీసుకున్న చర్యలను రైతులకు  వివరిస్తున్నారు.

BRS Urea Protest | రైతుల సమస్యలే ఎజెండా..

రెండేళ్లుగా దాదాపు స్తబ్దుగా ఉన్న క్యాడర్ ఈ పరిణామంతో మళ్లీ ఉత్సాహం తెచ్చుకుంది. యూరియా పోరాటాన్నే ప్రజాక్షేత్రంలోకి రీఎంట్రీకి వేదికగా మలుచుకున్న గులాబీ దళం, దీని ద్వారా కోల్పోయిన పట్టును తిరిగి సాధించాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. రైతుల సమస్యలను పార్టీ భుజానికెత్తుకొని ముందుకు సాగుతోంది. యూరియా యాప్ ఇబ్బందులతో పాటు ఇతర సమస్యలను ఎత్తి చూపుతోంది. రైతుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని నేతలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మాజీ ప్రజాప్రతినిధులు గ్రామాల బాట పట్టారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, కల్లాల్లో తడిసిన ధాన్యం, రైతుబంధు ఆలస్యం వంటి అంశాలను కూడా ఎజెండాలో చేర్చారు.

BRS Urea Protest | క్యాడర్‌లో కొత్త ఊపు..

ఓటమి తర్వాత డీలా పడ్డ రెండో శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు మళ్లీ క్రియాశీలకంగా మారుతున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో నిత్యం యూరియా కష్టాలకు సంబంధించిన సమాచారం షేర్ చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. పార్టీ కార్యాలయాల్లోనూ సందడి పెరిగింది. జిల్లా అధ్యక్షులు రోజువారీ సమీక్షలు నిర్వహిస్తూ, మండలాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమిస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఈ యూరియా ఉద్యమం ద్వారా గ్రామస్థాయిలో పట్టు పెంచుకోవాలని బీఆర్ఎస్ వ్యూహం పన్నుతోంది. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో మరింత హీట్ పెంచుతోంది. భవిష్యత్తులో ఉమ్మడి జిల్లాలో తిరిగి పట్టు సాధించి గులాబీ జెండా రెపరేపలాడేలా ప్లాన్ చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ పుంజుకుంటుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.

ఇది కూడా చదవండి: NEET Re Exam | నీట్​ పరీక్షకు లైన్​ క్లియర్​.. రీ-ఎగ్జామ్‌పై జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *