అక్షరటుడే, వెబ్‌డెస్క్: BSE Satvik Index | బీఎస్ఈ ఇండెక్స్ సర్వీసెస్ నైతిక పెట్టుబడులపై దృష్టి సారిస్తూ భారతదేశపు మొట్టమొదటి సాత్విక్ ఇండెక్స్‌ను ఇన్వెస్టర్లకు అందుబాటులోకి తెచ్చింది. బీఎస్ఈ 500 ఇండెక్స్ నుంచి సెలెక్ట్ చేసిన కంపెనీలతో సాత్విక్ 100 ఇండెక్స్‌ను ప్రారంభించింది.
BSE Satvik Index | స్వచ్ఛతకు సూచిక..
‘సాత్విక’ అనే పదం స్వచ్ఛత, బాధ్యత మరియు నైతిక ప్రవర్తనను సూచిస్తుంది. కేవలం లాభాల కోసమే కాకుండా, సమాజానికి, పర్యావరణానికి సానుకూలంగా దోహదపడే కంపెనీలపై దృష్టి సారించే పర్యావరణ, సామాజిక, పరిపాలన పెట్టుబడులపై ఆసక్తి పెరుగుతున్న తరుణంలో ఈ సూచీని ప్రారంభించారు. పొగాకు, మద్యం, జూదం, మాంసం, జంతుహింస వంటి వ్యాపారాలకు దూరంగా ఉంటూ పారదర్శక పాలన సాగించే టాప్ 100 కంపెనీలను ఇందులో చేర్చారు. సంవత్సరానికి రెండుసార్లు(జూన్, డిసెంబర్ నెలల్లో) ఈ ఇండెక్స్‌ను సమీక్షించి కంపెనీల జాబితాను పునర్వ్యవస్థీకరించనున్నారు.
BSE Satvik Index | నైతిక విలువల ఆధారంగా..

దేశంలో ఎన్విరాన్మెంటల్, సోషల్, గవర్నెన్స్ (ఈఎస్జీ) పెట్టుబడులపై ఆసక్తి పెరుగుతోంది. అంటే కేవలం లాభనష్టాల లెక్కల చుట్టూనే కాకుండా నైతిక విలువల ఆధారంగా పలువురు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులకు విలువ ఆధారిత సూత్రాలతో తమ పెట్టుబడులను అనుసంధానించుకునే అవకాశాన్ని కల్పించడం కోసం బీఎస్ఈ చర్యలు చేపట్టింది. ‘బీఎస్ఈ సాత్విక్ 100’ ఇండెక్స్‌ను అధికారికంగా ప్రారంభించింది. సమాజానికి హాని చేయని, పర్యావరణ స్పృహ ఉన్న, నైతిక విలువలతో వ్యాపారం చేసే కంపెనీలలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇదొక చక్కని వేదికగా నిలుస్తుందని భావిస్తున్నారు.
BSE Satvik Index | ఆర్థిక సేవల రంగానికి అధిక ప్రాధాన్యత..
ఈ ఇండెక్స్‌లో ఆర్థిక సేవల రంగానికి 37.55 శాతం వెయిటేజ్ ఉంది. దీని తర్వాత కన్స్యూమర్ డిస్క్రిషనరీ, ఎనర్జీ రంగాలున్నాయి. కమోడిటీస్, ఇండస్ట్రియల్స్, యుటిలిటీస్, టెలికమ్యూనికేషన్స్, సర్వీసెస్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, హెల్త్‌కేర్ రంగాలకు చెందిన కంపెనీలనూ ఈ ఇండెక్స్‌లో చేర్చారు. ఇండివిడ్యువల్‌గా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అత్యధిక వెయిటేజీతో అగ్రస్థానంలో ఉండగా.. ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank), రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీటితో పాటు ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి లార్జ్ క్యాప్ దిగ్గజాలకు ఇందులో ప్రాధాన్యత లభించింది.
ఇది కూడా చదవండి..: Aprilia SR Tribute Edition | స్పోర్టీ లుక్కు దేశభక్తి మేళవింపు.. ఏప్రిలియా ఎస్ఆర్ ట్రిబ్యూట్ ఎడిషన్స్ లాంచ్