Telangana University | తెయూలో వర్గపోరు.. రెండుగా విడిపోయిన ఆచార్యులు

Balla Sandeep Kumar

అక్షరటుడే, తెయూ క్యాంపస్: Telangana University | విశ్వవిద్యాలయం అంటే విజ్ఞానానికి నిలయంగా, సమాజానికి మార్గదర్శకంగా నిలవాలి. తరగతి గదుల్లో విద్యార్థులతోనిత్యం విరాజిల్లాలి. ఆచార్యులు పరిశోధనలు, పేటెంట్ల కోసం పోటీ పడాలి.

కానీ తెలంగాణ విశ్వవిద్యాలయం (Telangana University)లో పరిస్థితులు ఇందుకు భిన్నంగా మారుతున్నాయనే విమర్శలు ఏళ్లుగా వినిపిస్తున్నాయి. కొందరు ఆచార్యులు విద్యా, పరిశోధనల కంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం ఆధిపత్య పోరాటాలు సాగిస్తూ, విద్యార్థి సంఘాలను తమ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

తెయూలో ఆచార్యులు ఒకే విద్యా లక్ష్యంతో కాకుండా సామాజిక సమీకరణల ఆధారంగా వర్గాలుగా ఏర్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కీలక కమిటీలు, పరిపాలనా నిర్ణయాలు, నియామకాలు, పరిశోధన అవకాశాల్లో కూడా ఈ వర్గ ప్రభావం కనిపిస్తోందని అధ్యాపక వర్గాల నుంచే వినిపిస్తోన్న మాట. ఒక వర్గం తీసుకున్న నిర్ణయాన్ని మరో వర్గం వ్యతిరేకించడం, పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో విద్యా వాతావరణం దెబ్బతింటోంది.

Telangana University | పావులుగా విద్యార్థి సంఘాలు

విద్యార్థుల సమస్యలపై పోరాడాల్సిన సంఘాలు కూడా కొన్నిచోట్ల ఆచార్యుల వర్గ రాజకీయాలకు బలవుతున్నాయనే విమర్శలు లేకపోలేవు. కొన్ని సంఘాలకు పరోక్షంగా ఆర్థిక, ఇతర మద్దతు అందించి ప్రత్యర్థి వర్గాలపై ఉద్యమాలకు ఉసిగొల్పుతున్నారనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. నచ్చని అధికారులపై నిరసనలు చేయించడం, మీడియా సమావేశాలు పెట్టించడం, సోషల్ మీడియాలో ప్రచారం చేయించడం, ఫిర్యాదులు, వినతిపత్రాలు ఇప్పించడం లాంటి చర్యల్లో కొంతమంది ఆచార్యులు ఆరి తేరారు. ఇంకో అడుగు ముందుకేసి కర పత్రాలు ముద్రిస్తున్నారు.

Telangana University | పరిశోధనల కంటే..

Telangana University

విద్యార్థుల అకడమిక్ అభివృద్ధి, పరిశోధనలపై దృష్టి పెట్టాల్సిన కొందరు ఆచార్యులు వర్గ పోరాటాల్లో సమయం వెచ్చిస్తున్నారు. యూనివర్సిటీకి సమయానికి వచ్చి బయో మెట్రిక్ వేసి తరగతి గదుల్లో పాఠాలు బోధించకుండా క్యాంపస్ ప్రాంగణంలో వర్గ రాజకీయాలకు అధిక సమయం వెచ్చిస్తున్నారు. ఫలితంగా, పరిశోధన నాణ్యత తగ్గడం, పీహెచ్‌డీ విద్యార్థులకు ఇబ్బందులు, ప్రాజెక్టుల ఆలస్యం, అకడమిక్ వాతావరణం దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు.

Telangana University | పదవుల కోసం పోటీ

అడ్మినిస్ట్రేషన్ పదవులు, డీన్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్, వివిధ కమిటీల ఛైర్మన్ వంటి పదవుల విషయంలో వర్గ రాజకీయాలు ప్రభావం చూపుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అర్హత కంటే అనుబంధాలకు ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు సైతం కుల సమీకరణాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే అపవాదు నెలకొంది. యూనివర్సిటీలో వర్గ రాజకీయాలతో చివరకు విద్యార్థులు నష్టపోతున్నారు.

ఇది కూడా చదవండి..: Bhongir Fort Tourism | పర్యాటక కేంద్రంగా భువనగిరి కోట : మంత్రి జూపల్లి

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *