Jupally Krishna Rao Challenge | తప్పు రుజువైతే రాజీనామా చేస్తా.. దమ్ముంటే చర్చకు రండి: మంత్రి జూపల్లి

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పులు, బకాయిలపై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక సవాల్ విసిరారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Jupally Krishna Rao Challenge | గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పులు, బకాయిలపై మంత్రి జూపల్లి కృష్ణారావు  ( Jupally Krishna Rao )సవాల్ విసిరారు. తాను చేసిన ఆరోపణలు అబద్ధమని నిరూపిస్తే మంత్రి పదవితో పాటు, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని ఆయన సవాల్ చేశారు. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ అగ్రనేతల తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో అప్పుల విషయమై కేటీఆర్, హరీష్ రావు పూటకో మాట మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి విమర్శించారు. ఒకసారి ఒక నంబర్, మరోసారి ఇంకో నంబర్ చెబుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో అప్పులు, బకాయిలు కలిపి మొత్తం రూ. 8,21,651 కోట్లు అని ఆయన స్పష్టం చేశారు.

Jupally Krishna Rao Challenge | కేసీఆర్ ఫ్యామిలీకి లేఖ..

అప్పులపై వాస్తవాలు చర్చించేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు త్వరలోనే రాతపూర్వక లేఖ పంపుతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ లేఖను వాట్సాప్, ఈమెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా సీల్డ్ కవర్లలో పంపుతున్నానని చెప్పారు. నేను చెప్పిన లెక్కలు అబద్ధమని తేలితే రాజీనామా చేస్తా.. మరి నేను చెప్పింది నిజమైతే మీరు ఏం చేస్తారు? ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తారా? లేక కేసీఆర్ పార్టీనే రద్దు చేస్తారా?” అని సవాల్ విసిరారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో చేసిన అప్పులను ప్రజల నెత్తిన రుద్దడం బీఆర్ఎస్ నేతల సిగ్గుమాలినతనమని దుయ్యబట్టారు.

Jupally Krishna Rao Challenge | పాలమూరు పౌరుషం చూపిస్తా..

తనకు పదవుల కంటే ఆత్మగౌరవమే ముఖ్యమని, గతంలో కూడా ఆత్మగౌరవం కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశానని జూపల్లి గుర్తుచేశారు. “కేసీఆర్‌కు కుడి, ఎడమ భుజాలు అని చెప్పుకునే మీరు, మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క సీటు కూడా గెలిపించుకోలేకపోయారు. నేను బయటకు వచ్చాకే జిల్లాలో పార్టీకి 6 సీట్లు వచ్చాయి” అని కౌంటర్ ఇచ్చారు.

Jupally Krishna Rao Challenge | చర్చకు సిద్ధం – దమ్ముంటే రండి..

బీఆర్ఎస్ నేతలు ఎన్నికలకు ముందు ఓఆర్ఆర్ (ORR) లీజును అడ్డగోలుగా అమ్మి, ఆ సొమ్మును ఎలా వాడారో అందరికీ తెలుసని ఆరోపించారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారని, నిజంగా దమ్ముంటే సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌క్లబ్‌కు రావాలని సవాల్ విసిరారు. అక్కడ చర్చలో పాల్గొని ‘పాలమూరు పౌరుషం’ ఏమిటో తేల్చుకుందామని జూపల్లి కృష్ణారావు ఛాలెంజ్ చేశారు.

ఇది కూడా చదవండి:  Police Image | పోలీస్​ ఇమేజ్​ను పెంచేవిధంగా సిబ్బంది వ్యవహరించాలి..:సీపీ సాయిచైతన్య

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *