అక్షరటుడే, కామారెడ్డి: Urea Controversy | యూరియా పేరుతో రైతులను రెచ్చగొడితే ఊరుకునేది లేదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (MLA Madan Mohan Rao) హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జుక్కల్ ( Jukkal) ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ రావుతో కలిసి మదన్ మోహన్రావు మంగళవారం మీడియాతో మాట్లాడారు.
Urea Controversy | సోషల్మీడియా వేదికగా తప్పుడు ప్రచారం..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా వేదికగా కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు యూరియా యాప్(Urea App) పేరుతో రైతుల మీద పడ్డారని మండిపడ్డారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అన్ని సొసైటీలకు యూరియా సరఫరా అయిందని, బీఆర్ఎస్ నాయకులకు చదువు రాదని, చెప్తే అర్థం చేసుకోరని విమర్శించారు. పీఏసీఎస్ ఛైర్మన్లుగా కొనసాగుతూ బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తూ డీడీలు కట్టకుండా యూరియా రాకుండా చేసి రైతులను ఇబ్బందులు పెడుతున్నారని, ప్రభుత్వాన్ని బదనాం చేస్తామని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వాళ్ల డేటా అంతా తమ దగ్గర ఉందని, ఒక్కొక్కరిని లోపల వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. సోషల్ ఎలిమెంట్ యాక్ట్ కింద చర్యలు తప్పవని, యాప్లో టెక్నాలజీ ద్వారా రైతులకు యూరియా అందించాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు.
Urea Controversy | గతంలో బ్రోకర్లుగా వ్యవహరిస్తూ..
గతంలో వీరంతా మధ్యలో బ్రోకర్లుగా ఉండి కమీషన్లు తీసుకుంటూ ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులకు అమ్ముకుని సంపాదించిన రోజులు ఉన్నాయని, వారి లెక్కలు తీస్తే కటకటాల లోపలికి వెళ్తారన్నారు. యూరియా యాప్లో సాంకేతిక సమస్యలు, కొన్నిచోట్ల నెట్వర్క్ సమస్య ఉన్నమాట వాస్తవమేనని, వాట్సాప్, సోషల్ మీడియాలో వచ్చేవి నమ్మి రైతులు బలికావద్దని కోరారు. ఇది రైతు ప్రభుత్వమని, ఇందిరమ్మ ఇళ్లు వేలాదిగా కట్టిస్తున్నామని, కేటీఆర్ పదేళ్లలో ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలని ప్రశ్నించారు. వాళ్ళ ప్రభుత్వం ఏర్పడినట్టు, కేటీఆర్ సీఎం అయినట్టు ఫీల్ అవుతున్నారని, రెండేళ్లే కదా అయింది. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుంటూ.. ఎందుకు అంతలా ఆగమాగమవుతున్నావ్ అంటూ కేటీఆర్ నుద్దేశించి వ్యాఖ్యానించారు. రైతుల సమస్యల కోసం డీసీసీ కార్యాలయంలో కమిటీ ఏర్పాటు చేస్తామని, అరాచకాలు సృష్టించి రైతులను రెచ్చగొడితే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు.
Urea Controversy | కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లేకపోవడం విచారకరం -తోట లక్ష్మీకాంత్ రావు

140 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో కామారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉందని కానీ.. జిల్లాలో పార్టీ కార్యాలయం లేకపోవడం విచారకరమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు అన్నారు. అది ఎందుకు జరగలేదో తెలియదన్నారు. డీసీసీ అధ్యక్షుడిగా వచ్చిన తక్కువ కాలంలోనే ఏలే మల్లికార్జున్ ప్రత్యేక చొరవతో ప్రభుత్వం ఎకరం స్థలం కేటాయించిందని తెలిపారు. రూ.4.80 లక్షల ఫీజును ఇద్దరు ఎమ్మెల్యేలం చెల్లించామన్నారు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి బాకీ లేమని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయం పేరుతో ఎవరూ చందాలు, విరాళాలు చేయవద్దని హెచ్చరించారు. రైతుల విషయంలో ప్రభుత్వం ఏనాడు నిర్లక్ష్యం చేయలేదని, దేశంలోనే అత్యధికంగా 174 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్రం తెలంగాణ అని, 48 గంటల్లో డబ్బులు వేశామని చెప్పారు.
Urea Controversy | కాంగ్రెస్ పాలిత ప్రాంతాలపై సవతి తల్లి ప్రేమ..
కేంద్రంలోని బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని, యూరియా కొరతకు బీజేపీ మొండి వైఖరే కారణమని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలన కంటే 40 శాతం ఎక్కువగా పంటసాగు జరిగిందని, మోదీతో కొట్లాడైనా రైతులకు యూరియా సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. ఇవాళ జరిగే కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించామని, తాను రావాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వచ్చానని, రాకపోతే నష్టం తనకే తప్ప కార్యాలయం గౌరవం తగ్గదని న్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు నిమ్మ విజయ్ కుమార్, కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సందీప్, ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు బాలరాజు, రెడ్డి నాయక్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: పెరుగు ప్యాకెట్లో ఎలుక.. షాక్ కు గురైన వ్యక్తి..