అక్షరటుడే, వెబ్డెస్క్ : Gurukul Students Benefits | గురుకుల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన, ప్రపంచ స్థాయి విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TGSWREIS) మూడో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశం గురువారం సచివాలయంలోని మంత్రి ఛాంబర్లో నిర్వహించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిగ్రీ కళాశాలల నిర్వహణ కోసం ప్రత్యేక పరిపాలనా విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు యూజీసీ వేతన స్కేలు అమలుపై సానుకూల నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీ కళాశాలలకు న్యాక్ (NAAC) గుర్తింపు సాధించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.
Gurukul Students Benefits | విద్యార్థులకు ల్యాప్టాప్లు
ఉన్నత విద్య కోసం దేశ, విదేశీ విశ్వవిద్యాలయాలకు వెళ్లే ఎస్సీ విద్యార్థులకు ల్యాప్టాప్లు, ఆర్థిక సహాయం అందించేందుకు సమావేశంలో ఆమోదించారు. 9వ తరగతి నుంచే నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు మరో 9 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) ప్రారంభించాలని నిర్ణయించారు. క్రాఫ్ట్ టీచర్లు, ఆర్ట్ టీచర్లను టీజీటీలుగా గుర్తించే ప్రతిపాదనకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Gurukul Students Benefits | ఫోన్ మిత్ర సౌకర్యం
సెలవు రోజుల్లో విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడేందుకు ఫోన్ మిత్ర సౌకర్యం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భవిష్యత్ ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని డిగ్రీ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోర్సులను ప్రవేశ పెడతామని మంత్రి తెలిపారు.
దీనిని కూడా చదవండి : Telangana Urea Supply | రామగుండంలో తయారయ్యే ఎరువులు తెలంగాణకే దక్కాలి: మంత్రి పొన్నం