RTC Strike | యథావిధిగా బస్సుల రాకపోకలు.. సమ్మెలో సొమ్మసిల్లిపోయిన కార్మికుడు

Srinivas Kolluri

అక్షరటుడే, కామారెడ్డి: RTC Strike | కామారెడ్డి (Kamareddy)లో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. మొదటి రోజు ప్రయాణికులు ఇబ్బంది పడ్డా మధ్యాహ్నం తర్వాత ఒక్కొక్కటిగా బస్సులు రోడ్డెక్కేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. మొదటి రోజు జరిగిన ఘటనల నేపథ్యంలో అధికారులు, పోలీసులు గురువారం పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.

RTC Strike | బస్టాండ్​ బయటే కార్మికులు..

సమ్మె చేస్తున్న కార్మికులను బస్టాండ్​ లోపలికి రానివ్వలేదు. ఎంట్రెన్స్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మెను శాంతియుతంగా నిర్వహించుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడిన కండక్టర్​పై పోలీసులు కేసు నమోదు చేసి కార్మికులకు హెచ్చరిక జారీ చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. దాంతో గురువారం కార్మికులు పోలీసులు చెప్పినట్లుగా బస్టాండ్​ బయట, రోడ్డుకు అవతల వైపు సమ్మె చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

RTC Strike | అద్దె బస్సులు.. ప్రైవేట్​ డ్రైవర్లు..

జిల్లాలో గురువారం ఉదయం నుంచి హైర్ బస్సులు, కొన్ని ప్రభుత్వ బస్సుల్లో ప్రైవేట్ డ్రైవర్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. బుధవారం కండక్టర్ లేకుండానే కదిలిన బస్సులు గురువారం కండక్టర్లతో బయలుదేరాయి. ప్రయాణికులు సైతం అధిక సంఖ్యలో బస్సుల్లో ప్రయాణించారు. ఇక బస్సులు నడవకపోతే తమ పంట పండినట్టేనని భావించిన ప్రైవేట్ వాహనాలకు చుక్కెదురైంది. కామారెడ్డి డిపో నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు కలిపి సుమారు 50 నుంచి 60 బస్సులు బయలుదేరడంతో ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణికులు వెళ్లడానికి నిరాకరించారు. ప్రైవేట్ బస్సులలో అధిక ఛార్జీలు పెట్టుకుని వెళ్లడం కంటే వేచిచూసి ఆర్టీసీ బస్సులోనే (RTC bus) వెళ్లడానికి ఆసక్తి చూపించారు. దీంతో ప్రైవేట్ బస్సులు ఖాళీగా దర్శనమిచ్చాయి. మరోవైపు కొత్త బస్టాండ్ ముందు సమ్మె చేపట్టిన ఆర్టీసీ కార్మికుల్లో కామారెడ్డి బస్ డిపోలో (Kamareddy Bus Depot) పనిచేస్తున్న రమేశ్​ తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. ఎండ వేడిమికి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయాడు. దాంతో తోటి కార్మికులు, పోలీసులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించారు.

ఇది కూడా చదవండి..: Indiramma Houses | కాంగ్రెస్​ ప్రభుత్వం పేదల పక్షం: మానాల మోహన్​ రెడ్డి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *