అక్షరటుడే, నిజామాబాద్: Registration Department | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రిజిస్ట్రేషన్ల కార్యాలయాలపై పర్యవేక్షణ కొరవడింది. డీఐజీ, డీఆర్ ఇన్‌ఛార్జీలే ఉండడంతో పూర్తిగా పాలన గాడి తప్పింది. దీంతో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దొడ్డిదారిలో రిజిస్ట్రేషన్లు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారు.
ఇటీవల నిజామాబాద్ అర్బన్ కార్యాలయం (Registration Department) పరిధిలో జరిగిన ఓ అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై ఏకంగా క్రిమినల్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఓ ఇంటి యజమాని బతికి ఉండగానే చనిపోయినట్లు తప్పుడు ధృవపత్రాలు సృష్టించి మరొకరి పేరిట బదిలీ చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఒకటో టౌన్ పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా.. ఇందులో డాక్యుమెంట్ రైటర్ పాత్ర కీలకంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు తప్పుడు ప్రతాలు అని తెలిసినా అప్పటి సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.
Registration Department | అడగోలుగా మ్యుటేషన్లు
నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో వారం కిందట మరో తప్పిదం జరిగిన విషయం తాజాగా బయటపడింది. ఈ నెల 17, 18 తేదీల్లో సుమారు 70 వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. కాగా.. వీటికి సంబంధించిన మ్యుటేషన్ ప్రక్రియలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇది కాస్తా.. దరఖాస్తుదారుల పాలిట శాపంగా మారింది.
వాస్తవానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలోనే మ్యుటేషన్‌కు సంబంధించిన రుసుము రూ. 3వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. తదనంతరం అమ్మిన వారి నుంచి కొన్న వారి పేరిట ఆస్తి తాలుకా మ్యుటేషన్ ప్రక్రియను అంతా ఆన్లైన్లో పూర్తి చేసి సంబంధిత మున్సిపల్ లాగిన్ రిఫర్ చేస్తారు. తదుపరిగా అక్కడి అధికారులు పున:పరిశీలన చేసి ఒకటిరెండు రోజుల్లో మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. కానీ 17, 18 తేదీల్లో జరిగిన పలు డాక్యుమెంట్లు మ్యూటేషన్ ప్రక్రియలో పెద్ద గందరగోళం జరిగినట్లు సమాచారం. రెసిడెన్షియల్ జోన్‌కు బదులుగా కమర్షియల్ జోన్లో ఉన్నట్లు ఐచ్చికం ఇవ్వడంతో దాదాపు 70 వరకు దస్తావేజుల మ్యుటేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో బాధితులు తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
Registration Department | ప్రత్యేక దృష్టి సారించాలి
రిజిస్ట్రేషన్లు అంటే రూ. కోట్ల ఆస్తుల తాలుకాతో కూడుకున్నది. అధికారులు, సిబ్బంది ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అధికారులు, సిబ్బంది ఎవరికి నచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ఎడిట్ ఇండెక్స్ ఆప్షన్ ఉన్నప్పటికీ ఇది డీఆర్ పరిధిలోని అంశం కావడంతో సదరు అధికారి సైతం ఇన్‌ఛార్జి కావడం వల్ల ఈ ప్రక్రియ కోసం బాధితులు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఇప్పటికైనా రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరుకుంటున్నారు.

ఇది కూడా చదవండి..: Kavitha New Party | ఇక పిట్టల దొరసాని క్యారెక్టర్‌ను చూస్తాం.. కవిత కొత్త పార్టీపై ఎంపీ అర్వింద్ సెటైర్లు..

