అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Summer Holidays | వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (collector Ila Tripathi) సూచించారు. సెలవులను ఉల్లాసంగా గడుపుతూ.. ఇష్టమైన రంగంలో ప్రతిభను మరింతగా మెరుగుపర్చుకునేలా కృషి చేయాలని హితవు పలికారు. డిచ్పల్లి(Dichpally) మండలం సుద్దపల్లిలో సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో(Social Welfare Girls Residential School) గురువారం నిర్వహించిన పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌కు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
Summer Holidays | సెలవుల్లో ఏం చేస్తారు..
నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభమవుతాయని.. సెలవుల్లో ఏం చేస్తారని విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. స్విమ్మింగ్, కరాటే, డ్యాన్స్, సంగీతం వంటి వాటిలో తమ అభిరుచికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. వీలైతే చారిత్రక ప్రదేశాలను సందర్శించాలన్నారు. సెలవులను వృథా చేసుకోవద్దని, స్మార్ట్ఫోన్లకు అలవాటు పడి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని కలెక్టర్ సూచించారు.
Summer Holidays | స్మార్ట్ఫోన్లకు పిల్లలను దూరంగా ఉంచాలి..
ఈ వియంలో తల్లిదండ్రులు కూడా పిల్లలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని, వారంలో అరగంటకు మించి పిల్లలు స్మార్ట్‌ఫోన్ వినియోగించకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. బాలికలపై వివక్ష చూపకుండా వారిని ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించాలన్నారు. రెసిడెన్షియల్ స్కూల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ విద్యార్థినులకు కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. సమావేశంలో పాఠశాల ప్రిన్సిపాల్ నళిని, తహశీల్దార్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
వృద్ధాశ్రమం నిర్వహణను మెరుగుపర్చాలి
ప్రభుత్వం, రెడ్ క్రాస్ సంస్థల (Red Cross Society) సంయుక్త ఆధ్వర్యంలో డిచ్పల్లి మండలం రాంపూర్‌లో కొనసాగుతున్న వృద్ధాశ్రమాన్ని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. వృద్ధాశ్రమంలో అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. వృద్ధులు విశ్రాంతి తీసుకునే గదులలో వసతులు గమనించిన కలెక్టర్.. కూలర్లు, టెలివిజన్ వంటి సదుపాయాలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే వాటిని సమకూర్చాలని రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వాహకులను ఆదేశించారు. ఆశ్రమం చుట్టూ ముళ్లపొదలు, పిచ్చి మొక్కలను తొలగించాలని స్థానిక అధికారులకు సూచించారు.
వృద్ధాశ్రమం నిర్వహణపై ఆగ్రహం..
వృద్ధాశ్రమంలోని కిచెన్‌లో ఆహార పదార్థాలు, వంట సరుకుల నాణ్యతను పరిశీలించారు. కాలపరిమితి ముగిసిన పలు సరుకులు ఉండడాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధాశ్రమం నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని నిర్వాహకుల పనితీరుపై అసంతృప్తి వెలిబుచ్చారు. ఆశ్రమంలో ఉండే అనాథ వృద్ధులను తమ సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తూ, చక్కగా వారి ఆలనాపాలన చూసుకోవాలని కలెక్టర్ సూచించారు.
నామ్ కే వాస్తే అన్నట్లు కాకుండా..

నామ్ కే వాస్తే అన్నట్టు కాకుండా వృద్ధులపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కలెక్టర్ హితవు పలికారు. వృద్ధులకు అల్పాహారం, భోజనం అందించే విషయంలోనూ తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సరైన మోతాదులో పౌష్టికాహారం అందించాలని సూచించారు. వృద్ధుల ఆరోగ్య పరిరక్షణలో ఎంతమాత్రం రాజీ పడకూడదన్నారు. అవసరమైన అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండాలన్నారు. తాను త్వరలోనే మళ్లీ ఆశ్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, నిర్వహణ తీరులో మార్పు కనిపించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని సదుపాయాలు, వసతులు అందుబాటులో ఉండాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ అధికారిణి (District Welfare Officer) పద్మ, రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ బుస్సా ఆంజనేయులు, డిచ్పల్లి తహశీల్దార్ సతీష్, ఆర్ఐ ప్రభు తదితరులున్నారు.


