అక్షరటుడే, ఇందూరు: NEET Protest | నీట్ పేపర్ లీక్‌కు (NEET Paper Leak) బాధ్యత వహిస్తూ ప్రధాని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని యూత్ కాంగ్రెస్ (Youth Congress) జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ డిమాండ్ చేశారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
NEET Protest | దిష్టిబొమ్మ దహనం..
సమావేశం అనంతరం విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో యువకుల జీవితాలతో ఆడుకుంటూ వారి భవిష్యత్తును నాశనం చేసే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. నీట్ పేపర్ లీక్ ద్వారా ఎంతో మంది యువకుల జీవితాలు రోడ్లపైకి వచ్చాయని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. యువకులు పెద్ద ఎత్తున ఢిల్లీలో (Delhi) రోడ్లపైకి వచ్చే నిరసనలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం వారిని పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.20 మంది యువకులు సైతం ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులు ఎంతో బాధలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
NEET Protest | రాహుల్‌గాంధీ పోరాటం..
యువకులకు న్యాయం జరగాలని రాహుల్ గాంధీ వారి పక్షాన ‘చాత్రో కి గుంజ్’ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. యువకులకు న్యాయం జరిగే వరకూ రాహుల్ గాంధీ పోరాటాన్ని కొనసాగిస్తారని స్పష్టం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్‌ఛార్జి రోషిని జైష్వాల్, జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్‌ఛార్జి వినోద్ ఎర్రంశెట్టి హాజరయ్యారు. యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అద్నాన్, ప్రధాన కార్యదర్శి ఆదిత్య పాటిల్, ఇర్ఫాన్, రాజు గౌడ్, అసెంబ్లీ అధ్యక్షుడు మహేందర్, మొయిన్, యూనుస్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ శ్రీకాంత్, వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ‘ఇడుపు కాయితం’ అర్థం కావాలంటే పవన్‌ను అడగండి: కవిత