అక్షరటుడే వెబ్‌డెస్క్: KTR Vikarabad Meeting | కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమై, రైతులను, బడుగు బలహీన వర్గాలను తీవ్రంగా మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR) విమర్శించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు అభివృద్ధి పేరుతో రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. రైతుల కన్నీటి శాపం ప్రభుత్వానికి తగులుతుందని ఆయన హెచ్చరించారు. వికారాబాద్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలోనే జిల్లా కార్యాలయాలు, మెడికల్ కాలేజీలు, సాగునీటి ప్రాజెక్టులు వచ్చాయని, అలాంటి గొప్ప అభివృద్ధిని చూసి ఓర్వలేక స్పీకర్ అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
KTR Vikarabad Meeting | పోలీసులు, అధికారులకు హెచ్చరిక..
అధికార పార్టీకి కొమ్ము కాస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదని పోలీసులను, అధికారులను కేటీఆర్ హెచ్చరించారు. దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ కోసం 12 లక్షల చెట్లను నరికివేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలే పేదలకు శ్రీరామరక్ష అని ఆయన గుర్తు చేశారు.
KTR Vikarabad Meeting | 420 హామీలు..
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటి కూడా సరిగ్గా అమలు చేయలేదని, ఆ పార్టీకి ‘ఖేల్ ఖతం, దుకాన్ బంద్’ అయ్యే సమయం దగ్గర పడిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 2028లో తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
KTR Vikarabad Meeting | భయపడే ప్రసక్తే లేదు..
జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నామని పార్టీ నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని, కనీసం మున్సిపల్ రోడ్లను కూడా బాగు చేయించలేదని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నరేందర్ రెడ్డి, మహేష్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: NEET Protest | ప్రధాని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే..