అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minister Seethakka | గ్రామాల అభివృద్ధి అంటే భవనాలు, రోడ్లు నిర్మించడం మాత్రమే కాదని, గ్రామాల్లో నివసించే ప్రతి కుటుంబ జీవన ప్రమాణాలను మెరుగుపరచడమని మంత్రి సీతక్క తెలిపారు. గ్రామాలను స్వయం సమృద్ధిగా నగరాలకు తీసిపోని మౌలిక వసతులతో తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
జ్యోతిరావు పూలే ప్రజాభవన్ (Praja Bhavan)లో మంగళవారం నిర్వహించిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏడు గంటల పాటు సాగిన సమావేశంలో శాఖల వారీగా పనుల పురోగతిపై సమీక్షించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో సుమారు 1.35 లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారని, ఏటా రూ.34 వేల కోట్లకు పైగా నిధులు ఖర్చవుతున్నాయని వెల్లడించారు. అయినా గ్రామాల రూపురేఖలు ఆశించిన స్థాయిలో మారడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
Minister Seethakka | కఠిన చర్యలు తప్పవు

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. గ్రామాలకు వచ్చే ప్రతి రూపాయి ప్రజల ప్రయోజనాలకే ఖర్చు కావాలని స్పష్టం చేశారు. కొన్నిచోట్ల గ్రామసభలు నిర్వహించకుండా నిధులు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాల్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటానని, నిర్లక్ష్యం, అలసత్వం, బాధ్యతారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని మంత్రి హెచ్చరించారు.
ఇది కూడా చదవండి : ACB Raids | ఎక్సైజ్ సూపరింటెండెంట్ అవినీతి.. ఆస్తులు చూసి షాకైన ఏసీబీ