అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kukatpally Degree College | హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన విద్యార్థుల ప్రవేశాల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కూకట్‌పల్లి జిల్లా శాఖ ఆందోళన చేపట్టింది. విద్యార్థుల నుంచి కళాశాల సిబ్బంది అదనపు ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తూ, వాటిని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసింది.
Kukatpally Degree College | అదనపు ఆర్థిక భారం మోపొద్దు..
ఈ మేరకు ఏబీవీపీ నాయకులు కళాశాలకు చేరుకుని, నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ సిబ్బందిని నిలదీశారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులకే పరిమితమై అడ్మిషన్లు నిర్వహించాలని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపవద్దని కోరారు.
Kukatpally Degree College | అధికారికంగా నిర్ణయించిన ఫీజులే తీసుకోవాలి
ప్రభుత్వ విద్యాసంస్థల్లో పారదర్శకంగా ప్రవేశ ప్రక్రియ నిర్వహించాలని, అధికారికంగా నిర్ణయించిన ఫీజులు తప్ప మరే పేరుతోనూ వసూళ్లు చేయకూడదని ఏబీవీపీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఒకవేళ అక్రమ ఫీజుల వసూళ్లు కొనసాగితే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
అయితే, ఏబీవీపీ చేసిన ఆరోపణలపై కళాశాల యాజమాన్యం నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. విద్యార్థుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేసినట్లు ఆరోపణలు నిజమైతే సంబంధిత అధికారులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.