అక్షరటుడే, బోధన్: Bodhan Co-option Election | పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో (Bodhan Municipality) బోధన్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియను మంగళవారం నిర్వహించారు. ఈ ఎన్నిక ప్రక్రియ కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) పర్యవేక్షణలో కొనసాగింది. ఎక్స్ అఫిషియో సభ్యుని హోదాలో ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) పాల్గొన్నారు.
Bodhan Co-option Election | కోరం నిర్ధారించుకున్నాకే ఎన్నిక..
కో ఆప్షన్ ఎన్నిక కోసం సరిపడా కోరంను నిర్ధారించుకున్న మీదట ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. ఎక్స్ అఫిషియోను కలుపుకుని మొత్తం 39 మందికి గాను, పూర్తి స్థాయిలో 39 మంది సభ్యులు హాజరయ్యారు. ఆయా కేటగిరీల వారీగా కో ఆప్షన్ పదవి కోసం వచ్చిన ప్రతిపాదనల మేరకు పేర్లను చదువుతూ, చేతులు ఎత్తే పద్ధతి ద్వారా నలుగురు సభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నిక ప్రక్రియను ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రకటించిన తదుపరి 12మంది ఎంఐఎం కౌన్సిలర్లు ఎన్నికను బహిస్కరిస్తున్నామని ప్రకటించి సమావేశం హాల్ నుండి బయటకు వెళ్లిపోయారు. మిగతా సభ్యులతో ఎన్నిక ప్రక్రియను కొనసాగించారు. నాలుగు కోఆప్షన్ పదవులకు గాను మొత్తం 35 దరఖాస్తులు రాగా, పేర్లను చదువుతూ, చేతులు ఎత్తే పద్ధతి ద్వారా కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు.
Bodhan Co-option Election | కో ఆప్షన్ సభ్యులు వీరే..
మెజారిటీ సభ్యుల (19 మంది) మద్దతు మేరకు దండు సంగ్రామ్, మాసుల లక్ష్మి, మహమ్మద్ ఇమ్రాన్, రఫీయా బేగంలు కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ జాదవ్ కృష్ణ ప్రకటించారు. నూతనంగా కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. కో ఆప్షన్ ఎన్నికను పురస్కరించుకుని మున్సిపల్ కార్యాలయం వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నూతనంగా ఎన్నికైన కో ఆప్షన్ సభ్యులకు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి అభినందలు తెలియజేశారు. ఈ ఎన్నిక ప్రక్రియలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, బోధన్ ఆర్డీవో విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహశీల్దార్ విఠల్, ఆయా వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ