అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal Palle Davakhana | ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పల్లె దవాఖాన’ పథకం భీమ్‌గల్ మండలం (BheemgalMandal)లో రెండడుగులు ముందుకు.. మూడు అడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతోంది. స్థల ఎంపిక విషయంలో తీవ్ర జాప్యాన్ని ఎదుర్కొంటోంది. నిధులు మంజూరై ఏడాది కావస్తున్నా, అధికారుల నిర్లక్ష్య వైఖరితో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
Bheemgal Palle Davakhana | ఇరుకు గదుల్లోనే సేవలు
మండల కేంద్రంలో 12వార్డులు ఉన్నాయి. సుమారు 26వేల జనాభా ఉంది. 5,600 గృహాలు ఉన్నాయి. మండల కేంద్రంలోని బోదిరె గల్లీలోని ఒక ఇరుకైన అద్దె భవనంలో ప్రస్తుతతం పల్లె దవాఖాన కొనసాగుతోంది. స్థలం సరిపోక, గాలి వెలుతురు లేక గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యులకేమో పరీక్షలు చేయడానికి, రోగులకేమో వేచి ఉండటానికి తగినంత చోటు లేక సతమతమవుతున్నారు. ఈ దుస్థితిని గమనించిన ప్రభుత్వం, గత ఏడాది ఏప్రిల్‌లోనే కొత్త భవన నిర్మాణానికి రూ.19.98 లక్షల నిధులను మంజూరు చేసింది.
Bheemgal Palle Davakhana | అసంతృప్తిలో స్థానికులు

నిధులు మంజూరైనా, నిర్మాణం కోసం అధికారులు ఎంపిక చేసిన స్థలంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చివర, శ్మశానవాటిక సమీపంలో భవనం నిర్మించాలని చూడటం విడ్డూరమని ప్రజలు మండిపడుతున్నారు. అక్కడికి వెళ్లాలంటేనే రోగులు జంకుతున్నారు. పైగా, వర్షాకాలంలో ఆ ప్రాంతం జలమయమై, రాకపోకలకు ఆటంకం కలిగే ప్రమాదముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Bheemgal Palle Davakhana | అందుబాటులో ఉన్నచోటే కట్టాలి
– నీలం రవి, భీమ్‌గల్ మున్సిపల్ కౌన్సిలర్, సర్వసమాజ కమిటీ మాజీ అధ్యక్షుడు
పల్లె దవాఖాన నిర్మాణం అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించే దవాఖానను ఎక్కడ పడితే అక్కడ కాకుండా, ప్రజలకు అందుబాటులో ఉండే చోటనే నిర్మించాలి. దవాఖాన అంటే రోగులందరికీ అందుబాటులో ఉండాలి. శ్మశానవాటిక పక్కన దవాఖాన నిర్మించడం ఏమాత్రం సమంజసం కాదు. వర్షాకాలంలో అక్కడ నీరు నిలిచిపోయి రోగులు రావడం కష్టతరమవుతోంది. కనీస సౌకర్యాలు కూడా ఉండవు. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి, ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బోదిరె గల్లిలో లేదా జవ్వాజి భూమయ్య రైస్ మిల్ సమీపంలోని ప్రభుత్వ స్థలంలోనే దవాఖానా నిర్మించాలి.
ఇది కూడా చదవండి..: SRSP Flood Inflow | ఎస్సారెస్పీకి వరద వచ్చేనా.. నెల రోజులుగా జాడ లేని వానలు