SRSP Flood Inflow | ఎస్సారెస్పీకి వరద వచ్చేనా.. నెల రోజులుగా జాడ లేని వానలు

ఉత్తర తెలంగాణ వర ప్రదాయని శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ డెడ్​ స్టోరేజీకి చేరువలో ఉంది. వానాకాలం మొదలై నెల అవుతున్నా.. ప్రాజెక్ట్​కు వరద రావడం లేదు.

Srinivas Kolluri

అక్షరటుడే, ఆర్మూర్ : SRSP Flood Inflow | ఉత్తర తెలంగాణ వర ప్రదాయని శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (Sriram Sagar Project) డెడ్​ స్టోరేజీకి చేరువలో ఉంది. వానాకాలం మొదలై నెల అవుతున్నా.. ప్రాజెక్ట్​కు వరద రావడం లేదు. స్థానికంగా వర్షాలు లేకపోవడంతో జలాశయానికి ఇన్​ఫ్లో లేక వెలవెలబోతుంది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 15.149 టీఎంసీల నీరే ఉంది.

శ్రీరామ్​ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతo 1064.30 అడుగుల (15.149 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయంలో 15.672 టీఎంసీలు ఉండగా, ఈసారి 0.523 టీఎంసీలు తక్కువగా ఉంది. 24 గంటల సగటు ఇన్‌ఫ్లో 671 క్యూసెక్కులు మాత్రమే ఉండగా, ఔట్‌ఫ్లో 817 క్యూసెక్కులుగా ఉంది.

SRSP Flood Inflow | ఆయకట్టు రైతుల్లో ఆందోళన

జూన్ నెల ముగుస్తున్నా.. ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టు పరిధిలోని 6లక్షల ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సాగుకు నీరందుతుందా అనే భయం వెంటాడుతోంది. ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిస్తే తప్ప ప్రాజెక్ట్‌కు భారీగా ఇన్‌ఫ్లో వచ్చే పరిస్థితి లేదు.

SRSP Flood Inflow | మహారాష్ట్రపైనే ఆశలు

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూలై 1న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్​లో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ 14 గేట్లను ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు తెరువనున్నారు. దీంతో ఎగువ నుంచి కొంత ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉంది. ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిస్తేనే శ్రీరామ్​సాగర్​కు వరద వచ్చే అవకాశం ఉంది. బాబ్లీ గేట్లు అక్టోబర్ 28 వరకు 120 రోజులపాటు ఎత్తి ఉంచనున్నారు. మహారాష్ట్రలో బాబ్లీ ఎగువన ఉన్న ప్రాజెక్టులు అన్ని నిండిన తర్వాత ఎస్సారెస్పీకి వరద వస్తుందని అధికారులు తెలిపారు.

SRSP Flood Inflow | ఆయకట్టు రైతులపై ప్రభావం

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద మొత్తం 9.68 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీన్ని 3 స్టేజీలుగా విభజించారు. వీటిలో స్టేజ్-1లో నిజామాబాద్, కామారెడ్డిలలో 1.90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అలాగే స్టేజ్-2లో నిజామాబాద్, నిర్మల్, జగిత్యాలలో 2.08 లక్షల ఎకరాలు ఉన్నాయి. స్టేజ్-3లో జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, హన్మకొండ, సిద్దిపేట, సిరిసిల్ల, యాదాద్రి, నల్గొండ ఉండగా 5.70 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 15.149 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇది డెడ్ స్టోరేజీ 5.18 టీఎంసీలకు కంటే కొద్దిగా ఎక్కువ. బాబ్లీ గేట్లు తెరిచినా ఎగువన వర్షాలు పడకపోతే ప్రయోజనం ఉండదు. వెంటనే కాళేశ్వరం నుంచి నీటిని తరలించాలి అని ఎస్సారెస్పీ రైతు ఐక్యవేదిక డిమాండ్ చేస్తోంది.

SRSP Flood Inflow | అక్కడా వర్షాలు లేవు

SRSP Flood Inflow

ప్రస్తుతం మహారాష్ట్రలోని నాందేడ్, పర్భణి జిల్లాల్లో చెప్పుకోదగ్గ వర్షాలు పడలేదు. అక్కడ వర్షాలు కురిస్తేనే బాబ్లీకి ఇన్‌ఫ్లో వస్తుంది. గతేడాది జూలై-అక్టోబర్ మధ్య బాబ్లీ గేట్ల ద్వారా ఎస్సారెస్పీకి 32 టీఎంసీల ఇన్‌ఫ్లో వచ్చింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్ రెండో వారం నుంచి రుతుపవనాలు చురుగ్గా మారితేనే ఇన్‌ఫ్లో మొదలయ్యే అవకాశం ఉంది. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం కింద కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని శ్రీరామ్​సాగర్​కు తరలించాలని రైతులు కోరుతున్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి కాకతీయ కెనాల్ ద్వారా నీటిని పంపింగ్ చేసి ఎస్సారెస్పీ స్టేజ్-3 కాలువల్లోకి, అక్కడి నుంచి ఎస్సారెస్పీకి రిజర్వాయర్‌లోకి తరలిస్తారు. ‘కాళేశ్వరం నుంచి నీటిని తరలించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది’ అని ఎస్సారెస్పీ ఎస్‌ఈ గతంలోనే తెలిపారు.

ఇది కూడా చదవండి..: Minority Women Sewing Machines | మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం: షబ్బీర్ అలీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *