Husband Wife Dispute | భర్త వద్దు.. ప్రియుడే ముద్దు : కొడుకు, ఆస్తులపై హక్కులు వదులుకుంటానని భార్య రాతపూర్వక హామీ

ఇది ఆమె వ్యక్తిగత నిర్ణయమా? దాంపత్య జీవితంలో ఎదురైన పరిస్థితుల ప్రభావమా? లేక కొత్తగా ఏర్పడిన అనుబంధం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసిందా? అనే చర్చ సాగుతోంది.

Naresh Chandan

అక్షరటుడే, కామారెడ్డి, లింగంపేట: Husband Wife Dispute | పెళ్లి బంధం అంటే కేవలం ఇద్దరు వ్యక్తుల అనుబంధమేనా? పేగు పంచుకున్న బిడ్డతో ఉన్న బంధాన్ని కూడా ఒక్క నిర్ణయంతో తెంచుకోవచ్చా? జీవితంలో ఎదురైన మలుపులు మనిషిని ఇంతటి నిర్ణయం తీసుకునేలా చేస్తాయా? ఇప్పుడు తెలంగాణలోని కామారెడ్డి జిల్లా లింగంపేటలో వెలుగుచూసిన ఓ ఘటన ఈ ప్రశ్నలనే లేవనెత్తుతోంది.

భర్తను కాదని ప్రియుడితోనే జీవిస్తానని ఓ మహిళ తీసుకున్న నిర్ణయం స్థానికంగా చర్చనీయాంశమైంది. అంతేకాదు.. ఇకపై తనకు భర్తతో ఎలాంటి సంబంధం లేదని, తన కొడుకు, ఆస్తులపై కూడా తనకు ఎలాంటి హక్కు లేదని పోలీసుల సమక్షంలో రాతపూర్వకంగా వెల్లడించడం మరింత ఆసక్తిని రేకెత్తించింది.

Asaduddin Owaisi | రేవంత్ దూకుడును కంట్రోల్ చేయాలని కేసీఆర్‌కు ముందే చెప్పా: అసదుద్దీన్ ఒవైసీ

Husband Wife Dispute | 16 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు..

లింగంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు సుమారు 16 ఏళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. కొంతకాలం తర్వాత దంపతుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఇదే సమయంలో సుమారు మూడేళ్ల క్రితం అదే మండలంలోని ఓ తండాకు చెందిన వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా సన్నిహిత సంబంధంగా మారినట్లు ఆమె పోలీసుల ఎదుట వెల్లడించినట్లు సమాచారం.

Husband Wife Dispute | ఒక్కసారిగా మారిన నిర్ణయం

భర్తతో విభేదాల నేపథ్యంలో గతంలో వరకట్నం కేసు పెట్టి కోర్టు చుట్టూ తిరిగిన ఆమె.. ఇప్పుడు మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. భర్తతో ఇకపై సంసారం చేయబోనని, తనకు భర్త వద్దని, తాను ప్రియుడితోనే ఉంటానని పోలీసుల సమక్షంలో స్పష్టం చేసింది. తన ప్రియుడినే వివాహం చేసుకుని అతనితోనే జీవితాన్ని కొనసాగిస్తానని గ్రామస్థులు, పోలీసుల సమక్షంలో రాతపూర్వకంగా ఇచ్చినట్లు సమాచారం.

Husband Wife Dispute | ‘కొడుకు.. ఆస్తులు కూడా వద్దు’

ఈ ఘటనలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అంశం ఏమిటంటే.. భర్తతో బంధాన్ని మాత్రమే కాకుండా.. తన కుమారుడితో ఉన్న పేగు బంధం, ఆస్తుల విషయంలోనూ వెనక్కి తగ్గుతానని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.

తనకు కుమారుడిపై, ఆస్తులపై ఎలాంటి సంబంధం లేదని, తన పేరిట ఉన్న భూములు, ఇతర లావాదేవీలను భర్త పేరిట మార్చి ఇస్తానని పేర్కొన్నట్లు సమాచారం.

ఒకవైపు 16 ఏళ్ల వైవాహిక బంధం.. మరోవైపు మూడేళ్లుగా ఏర్పడిన పరిచయం. ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితిలో ఆమె తన నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించడం స్థానికంగా చర్చకు దారితీసింది.

Husband Wife Dispute | కేసులోనూ రాజీకి సిద్ధమని వెల్లడి

గతంలో భర్తపై పెట్టిన వరకట్నం కేసులోనూ రాజీ కుదుర్చుకుంటానని ఆమె తెలిపినట్లు సమాచారం. కేసును వెనక్కి తీసుకోవడంతో పాటు భర్తకు అనుకూలంగా కోర్టులో సాక్ష్యం చెబుతానని కూడా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు భర్తతో విభేదాలు, కేసులు అంటూ సాగిన వ్యవహారం.. ఇప్పుడు పూర్తిగా మరో మలుపు తిరిగింది.

Husband Wife Dispute | బంధాలు ఇంత సులువుగా తెగిపోతాయా?

భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం కొత్త కాదు. ఒక దశలో ఏర్పడిన అనుబంధం మరో బంధాన్ని ప్రభావితం చేయడం కూడా జరుగుతూనే ఉంది. కానీ.. ఏళ్ల తరబడి కొనసాగిన దాంపత్య బంధాన్ని, తన బిడ్డతో ఉన్న పేగు బంధాన్ని సైతం వదులుకోవాలనే నిర్ణయం ఎంతటి భావోద్వేగ పోరాటం తర్వాత తీసుకున్నదన్నదే ఇప్పుడు ప్రశ్న.

ఇది ఆమె వ్యక్తిగత నిర్ణయమా? దాంపత్య జీవితంలో ఎదురైన పరిస్థితుల ప్రభావమా? లేక కొత్తగా ఏర్పడిన అనుబంధం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసిందా? అనే చర్చ సాగుతోంది.

ఏదేమైనా.. ‘భర్త వద్దు.. ప్రియుడితోనే ఉంటా’ అంటూ పోలీసుల సాక్షిగా రాతపూర్వకంగా చెప్పిన ఈ ఘటన లింగంపేటలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? గత కేసు పరిస్థితి ఏమిటి? ఆస్తుల బదలాయింపుపై చట్టపరమైన పరిణామాలు ఎలా ఉంటాయి? అన్నది వేచి చూడాల్సిందే.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *