Telangana University Courses | తెయూలో జాడలేని బీఫార్మసీ, బీపీఈడీ కోర్సులు.. ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఉన్నత విద్యా కేంద్రంగా పేరుగాంచిన తెలంగాణ యూనివర్సిటీలో ఇప్పటికీ బీఫార్మసీ కోర్సు లేకపోవడం విద్యార్థులకు ఇబ్బందిగా మారింది.

shashi kiran Mottala

అక్షరటుడే, తెయూ క్యాంపస్: Telangana University Courses | ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఉన్నత విద్యా కేంద్రంగా పేరుగాంచిన తెలంగాణ యూనివర్సిటీలో ఇప్పటికీ బీఫార్మసీ కోర్సు లేకపోవడం విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్ తదితర జిల్లాల విద్యార్థులు ఈ కోర్సు కోసం హైదరాబాద్​ (Hyderabad) వెళ్లాల్సి వస్తోంది.

Telangana University Courses | రూ.లక్షల్లో ఆర్థిక భారం..

బైపీసీ విద్యార్థులు ఫార్మసీ చదవాలంటే హైదరాబాద్, వరంగల్ లేదా ప్రైవేట్ కళాశాలలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో కుటుంబాలపై లక్షల రూపాయల ఆర్థిక భారం పడుతోంది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో బీ ఫార్మసీ కోర్సులకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ, యూనివర్సిటీ కళాశాలల్లో సీట్లు దాదాపు పూర్తిగా నిండిపోతుండటం ఈ కోర్సుకు ఉన్న ఆదరణకు నిదర్శనం. అయితే నల్గొండలోని మహాత్మగాంధీ యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరం బీ ఫార్మసీ కోర్సుకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి వచ్చినట్లు అక్కడి వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఇటీవల ప్రకటించారు. త్వరలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సు(బీపీఈడీ) ప్రవేశ పెట్టాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మన నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో బీ ఫార్మసీ కోర్సు ఆవశ్యకతను విద్యార్థులు గుర్తు చేస్తున్నారు.

Telangana University Courses | గ్రామీణ విద్యార్థులకు ఇబ్బందులు

ఉత్తర తెలంగాణలోని సాధారణ రైతు, కూలీ కుటుంబాలకు చెందిన విద్యార్థులు హైదరాబాద్‌లో చదవాలంటే ఏడాదికి అధిక ట్యూషన్ ఫీజులు, హాస్టల్, మెస్ ఖర్చులు, రవాణాతో తడిసి మోపెడవుతోంది. ఇవన్నీ కలిపి నాలుగేళ్ల బీఫార్మసీ కోర్సుకు రూ.లక్షల్లో ఖర్చవుతున్నాయి. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో చాలామంది విద్యార్థులు తమ కలలను మధ్యలోనే వదులుకోవాల్సి వస్తోంది.

Telangana University Courses | ఫార్మా రంగానికి తెలంగాణే కేంద్రం

హైదరాబాద్‌ను దేశ ఫార్మా రాజధానిగా పిలుస్తారు. ప్రపంచ స్థాయి ఔషధ తయారీ సంస్థలు, పరిశోధనా సంస్థలు తెలంగాణలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తర తెలంగాణ విద్యార్థులకు సమీపంలోనే నాణ్యమైన ఫార్మసీ విద్య అందించడం అత్యంత అవసరం. ఫార్మసీ రంగంలో ఉద్యోగ అవకాశాలు, పరిశోధన, నియంత్రణ వ్యవహారాలు, ఆసుపత్రి సేవలు, అంతర్జాతీయ కెరీర్ అవకాశాలు పెరుగుతున్నాయి.

Telangana University Courses | తెయూలో బీఫార్మసీ కోర్సు ఎందుకంటే

తెలంగాణ యూనివర్సిటీలో బీ ఫార్మసీ కోర్సు ఏర్పాటు చేస్తే ఉత్తర తెలంగాణ విద్యార్థులకు అందుబాటు ఉంటుంది. పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుంది. స్థానిక ఔషధ పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన మానవ వనరుల తయారీ, పరిశోధన, స్టార్టప్‌లు, పరిశ్రమలతో భాగస్వామ్యానికి అవకాశం ఉంటుంది. యూనివర్సిటీ ప్రతిష్ఠ, విద్యార్థుల ప్రవేశాలు పెరిగే అవకాశం. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీలో బీ ఫార్మసీ కోర్సు ప్రారంభించాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అవసరమైన భవనాలు, ప్రయోగశాలలు, అధ్యాపకులను ఏర్పాటు చేసి వచ్చే విద్యా సంవత్సరంలోనే కోర్సును ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Telangana University Courses | బీపీఈడీ కోర్సు అవసరం

Telangana University Courses

గ్రామాల్లో అపారమైన క్రీడా నైపుణ్యం కలిగిన యువత ఉన్నారు. కానీ, వారికి సరైన దిశానిర్దేశం, ఉన్నత విద్యనభ్యసించేందుకు స్థానికంగా అవకాశాలు లేకపోవడం ఒక పెద్ద లోటుగా మారింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ) కోర్సును ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల నుండి ఎంతో మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి వస్తున్నారు. అయితే, ఇంటర్ లేదా డిగ్రీ తర్వాత వారు క్రీడలనే కెరీర్‌గా ఎంచుకోవడానికి ఇక్కడ బీపీఈడీ కోర్సు అందుబాటులో లేదు.

Telangana University Courses | బీపీఈడీ కోసం హైదరాబాద్​.. మహారాష్ట్ర

ప్రస్తుతం నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాల విద్యార్థులు బీపీఈడీ చేయాలంటే హైదరాబాద్ (ఉస్మానియా), వరంగల్ (కాకతీయ), పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవడంతో హాస్టల్ ఖర్చులు, ఫీజులు పేద విద్యార్థులకు భారంగా మారుతున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లలేక ఎంతో మంది ప్రతిభావంతులైన మహిళా క్రీడాకారిణులు తమ క్రీడా జీవితాన్ని మధ్యలోనే ముగించేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తులో చేపట్టబోయే ఉపాధ్యాయ నియామకాల్లో (DSC) ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) పోస్టులు కీలకమైనవి. స్థానికంగా బీపీఈడీ కోర్సు అందుబాటులో ఉంటే, ఇక్కడి యువత శిక్షణ పొంది ప్రభుత్వ ఉద్యోగాలను సాధించే అవకాశం మెరుగవుతుంది.

Telangana University Courses | తెలంగాణ యూనివర్సిటీలో అన్ని సౌకర్యాలు..

తెలంగాణ యూనివర్సిటీలో విశాలమైన స్థలాలు ఉన్నందున, బీపీఈడీ కోర్సును కూడా ప్రవేశపెడితే బాగుంటుంది. వర్సిటీ స్పోర్ట్స్ విభాగం మరింత బలోపేతం అవుతుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు తెలంగాణ వర్సిటీ వేదికగా మారుతుంది. విశ్వవిద్యాలయానికి సరికొత్త గుర్తింపు లభిస్తుంది. తెలంగాణ యూనివర్సిటీలో బీపీఈడీ కోర్సును ఏర్పాటు చేయడం అనేది కేవలం ఒక కోర్సును ప్రారంభించడం కాదు, వేలాది మంది గ్రామీణ క్రీడాకారుల కలలను నిజం చేయడమని విద్యార్థులు పేర్కొంటున్నారు. వర్సిటీ పాలకమండలి, ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి, రాబోయే విద్యాసంవత్సరం నుంచి అయినా ఇక్కడ బీపీఈడీ కోర్సును ప్రారంభించాలని క్రీడాకారులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: Paidi Rakesh Reddy | మహేష్ కుమార్ గౌడ్​కు దమ్ముంటే ఆర్మూర్​ నుంచి పోటీ చేయాలి : ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *