అక్షరటుడే, కామారెడ్డి: Rice Prices Rise | సామాన్యుడి కంచంలో బియ్యం ధరలు మంట పుట్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా (Telanagana) సన్నబియ్యం ధరలు సామాన్యులకు అందని రీతిలో పెరుగుతున్నాయి. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లాలో బియ్యం ధరలు అమాంతం పెరగడంతో ప్రజలు అవాక్కవుతున్నారు.
Rice Prices Rise | సన్నబియ్యానికి అలవాటుపడి..
నాలుగైదేళ్లుగా సామాన్య ప్రజలు సైతం సన్నబియ్యానికి అలవాటు పడ్డారు. ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తుండటంతో ప్రతి నిరుపేద సన్నబియ్యానికి అలవాటు పడ్డారు. దాంతో ఈ బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో పేద, మధ్య తరగతి ప్రజలు సులభంగా కొనుగోలు చేసే సన్న బియ్యం ఇప్పుడు అందని ద్రాక్షగా మారింది. గతంలో దొడ్డు బియ్యం తినే పేదలు కూడా ఇప్పుడు సన్న బియ్యానికి అలవాటు పడటంతో డిమాండ్ భారీగా పెరిగింది. ప్రభుత్వం ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నా, కుటుంబంలో సభ్యులు ఎక్కువగా ఉండటం, పండుగలు, శుభకార్యాలకు బయట కొనాల్సి రావడంతో సామాన్యుడు బయట మార్కెట్ మీద ఆధారపడక తప్పడం లేదు. నాలుగు నెలల క్రితం వరకు కుటుంబ అవసరాలకు సరిపడా 25 కిలోల బస్తా రూ.1,250-1,500 కి వచ్చేది. ఇప్పుడు అదే బస్తా రూ.1,900-2,100 పలుకుతోంది. రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు బియ్యం కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెలసరి బడ్జెట్ లో బియ్యానికే అదనంగా రూ.500-800 భారం పడుతోందని గృహిణులు వాపోతున్నారు.
Rice Prices Rise | రూ.20 నుంచి రూ.30 వరకు పెంపు
ప్రస్తుతం మార్కెట్లో ప్రతి కిలో బియ్యంపై రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగింది. ఇది సాధారణ పెరుగుదల కాదని, 40శాతం వరకు పెరుగుదల అని వ్యాపారులే చెప్తున్నారు. నాలుగు నెలల క్రితం కిలో రూ.50-55 ఉన్న సాధారణ సన్న బియ్యం ఇప్పుడు రూ.65-83 కి చేరింది. నాణ్యమైన బియ్యం విషయానికి వస్తే ఆర్ఎన్ఆర్ రకం రూ.74-85, బీపీటీ (సాంబా మసూరి) రూ.70-80, హెచ్ఎంటి రూ.73-80, జై శ్రీరామ్, సోనా మసూరి వంటి ప్రీమియం రకాలు రూ.80-100 పలుకుతున్నాయి. కనీసం పేదలు తినే నూకల ధర కూడా కిలో రూ.20 నుంచి రూ.30 కి పెరిగింది. అంటే నెలకు 30 కిలోలు వాడే కుటుంబానికి అదనంగా రూ.600-900 భారం పడుతోంది. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే సన్నాల ధరలు ఊహించని రీతిలో పెరిగాయి. అధికారిక లెక్కల ప్రకారం జూలైలో సగటు రిటైల్ ధర రూ.54.4 ఉండగా, అక్టోబర్ నాటికి రూ.61.6 కి చేరి 13శాతం పెరుగుదల నమోదైంది. కానీ క్షేత్రస్థాయిలో రిటైల్ మార్కెట్లో ఈ పెరుగుదల 25-30శాతం వరకు ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 26 కిలోల బ్యాగ్ ధర రూ.2,000 దాటడం ఇదే మొదటిసారి. ఎల్నినో భయంతో వ్యాపారులు రేట్లు పెంచడమే కాక, ప్రభుత్వ కొనుగోళ్లు ఎక్కువ కావడంతో బయట మార్కెట్ కు సరుకు తక్కువ వస్తోంది.
సన్న వడ్లకు డిమాండ్..
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని బాన్సువాడ, బోధన్, వర్ని, రుద్రూర్, ఎడపల్లిలో ముందస్తు వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. రైతులు ప్రతి ఏటా ముందే నారు పోసి, ముందే కోతలు చేస్తారు. దీంతో ఇక్కడి బీపీటీ సన్నవడ్లకు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వ్యాపారులు, మిల్లర్లు నేరుగా కల్లాల వద్దకే వచ్చి పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. తేమ 25-30శాతం ఉన్నా అభ్యంతరం చెప్పకుండా నగదు ఇచ్చి తీసుకెళ్తున్నారు. వారం క్రితం క్వింటా రూ.3 వేలలోపు ఉన్న వడ్లు ఇప్పుడు రూ.3,400-3,600 పలుకుతున్నాయి. జై శ్రీరామ్ వడ్లు అయితే క్వింటా రూ.4,500 కి చేరాయి.
ఎల్-నినో, అక్రమ నిల్వలే పెరుగుదలకు కారణమా?
ధరల పెరుగుదల వెనుక మూడు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఎల్-నినో ప్రభావంతో వానాకాలం వరి సాగు గతేడాది ఈసారి భారీగా తగ్గింది. భవిష్యత్తులో కొరత వస్తుందనే అంచనాతో పెద్ద వ్యాపారులు, మిల్లర్లు గోదాముల్లో వేల క్వింటాళ్లు నిల్వ చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకం కోసం 148 లక్షల టన్నులలో 70 లక్షల టన్నులు కొనుగోలు చేయడం, రూ.500 బోనస్ ఇవ్వడంతో రైతులు ప్రభుత్వానికే అమ్ముతున్నారు. దీంతో బయట మార్కెట్కు సరుకు తగ్గింది. దీనికి తోడు రేషన్ సన్న బియ్యాన్ని దళారులు కిలో రూ.22-25 కి సేకరించి పాలిష్ పట్టి బ్రాండెడ్ పేరుతో రూ.50 కి అమ్ముతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే నిల్వలపై దాడులు చేసి ధరలు అదుపు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: దేశంలో.. నోట్ చోరీ.. వోట్ చోరీ సీపీఐ నారాయణ