అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao Arrest 1 | బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద చోటుచేసుకున్న ఒక విచిత్రమైన ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
సాధారణంగా నిరసనలు, అరెస్టుల సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు, తోపులాటలు జరగడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం పోలీసులను, డ్రైవర్‌ను అయోమయంలో పడేసేలా ఒక ఆసక్తికర ఘట్టం నడిచింది.
హరీష్ రావును అదుపులోకి తీసుకునే క్రమంలో అక్కడ నిలిపి ఉంచిన ఒక డీసీఎం (DCM) వాహనం వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ లోపు కొందరు పార్టీ కార్యకర్తలు చేసిన పనికి ఆ వాహన డ్రైవర్ లబోదిబోమన్నాడు.
Harish Rao Arrest | హరీశ్‌రావును అడ్డుకున్న పోలీసులు.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత
Harish Rao Arrest 1 | పోలీసులకు డ్రైవర్ గోడు
ఈ గందరగోళ పరిస్థితుల మధ్య సదరు డీసీఎం వాహన డ్రైవర్ పోలీసులకు కంగారుగా ఒక విషయాన్ని వివరిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. వాహనం ఇంజిన్ ఆన్‌లో (స్టార్ట్ లో) ఉండగానే.. కొందరు కార్యకర్తలు ఒక్కసారిగా వచ్చి డోర్ తెరిచి, కీ-చైన్‌ను లాక్కుని తాళాలు పట్టుకుపోయారని పోలీసుల ఎదుట సదరు డ్రైవర్ వాపోయాడు.
“సార్.. గాడి ఆన్‌లోనే ఉంది. డోర్ తీసి తాళాలు పీక్కుని వెళ్ళిపోయారు!” అంటూ ఆ డ్రైవర్ పోలీసులకు ఆవేదనగా వివరిస్తున్న సంభాషణ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది.

Harish Rao Arrest 1 | సోషల్ మీడియాలో నవ్వుల పువ్వులు
వాహనాన్ని పోలీసులు ముందుకు కదపకుండా అడ్డుకోవాలనే వ్యూహంతోనే కార్యకర్తలు ఈ తాళాల పని పట్టి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు.
అయితే, కదిలేందుకు సిద్ధంగా (ఆన్ లో) ఉన్న బండి తాళాలను అలా రన్నింగ్‌లోనే ఎలా ఊడబెరికారబ్బా? అంటూ నెట్టింట ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి.
హరీష్ రావు అరెస్టు తాలూకు హై-డ్రామా ఒకవైపు నడుస్తుంటే, మరోవైపు డ్రైవర్ పోలీసుల మధ్య జరిగిన ఈ ‘తాళాల’ పంచాయితీ విజువల్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ వాట్సప్, ఎక్స్ (ట్విట్టర్) వేదికల్లో తెగ షేర్ అవుతోంది.