అక్షరటుడే, వెబ్‌డెస్క్: Konda Surekha Delhi Visit | తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అకస్మాత్తుగా ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తనపై జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అధిష్టానం పిలుపునిచ్చిందనే వార్తల నడుమ ఆమె మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.
హైకమాండ్ నుంచి తనను ఎవరూ ప్రత్యేకంగా పిలవలేదని, కేవలం వ్యక్తిగత పనుల నిమిత్తమే హస్తినకు వచ్చానని ఆమె స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjun Kharge )అపాయింట్‌మెంట్ కోరానని, ఆయనను కలిసేందుకే ఇక్కడికి వచ్చినట్లు వెల్లడించారు. ఈ భేటీలో ఖర్గేతో పాటు పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌ను కూడా ఆమె కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Konda Surekha Delhi Visit | రాజకీయ పరిణామాలు..
కొద్దిరోజులుగా మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం, ఆమెకు షోకాజ్ నోటీసులు ఇస్తారనే ప్రచారం రాజకీయ దుమారం రేపింది. ఈ తరుణంలోనే ఆమె ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనలో ఉండటం, త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ లేదా మార్పులు ఉంటాయనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ హైకమాండ్ కేవలం వివరణతో సరిపెట్టి వివాదానికి తెరదించుతుందా, లేదంటే ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుందనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి: Bigala Ganesh Gupta | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచింది : మాజీ ఎమ్మెల్యే బిగాల