అక్షరటుడే, బాన్సువాడ: Six Guarantees Implementation | కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెయ్యి రోజుల్లో హామీల అమలులో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాజిరెడ్డి గోవర్ధన్ (Bajireddy Govardhan) ఆరోపించారు. బాన్సువాడ (Banswada) పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Six Guarantees Implementation | ప్రజలను మోసం చేశారు
నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదని అన్నారు. రైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పి ఆ హామీని కూడా అమలు చేయడం లేదని విమర్శించారు.
Six Guarantees Implementation | హామీలు అమలు చేయాలి
వృద్ధుల పింఛన్‌ను రూ.4 వేలకు పెంచుతామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మోరిల్ శ్రీనివాస్, అంజిరెడ్డి, జుబేర్, రత్నకుమార్, ధర్మ తేజ, మోచి గణేష్, బాడీ శ్రీను, చందర్, ఖలీల్,సద్దాం తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: బస్సుకు తప్పిన ఘోర ప్రమాదం