అక్షరటుడే, వెబ్‌డెస్క్: Plastic Free Society | పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి విద్యార్థులే నాంది పలకాలని సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపల్ ఆర్. నర్సయ్య పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ Nizamabad జిల్లా సిరికొండలోని సత్యశోధక్ పాఠశాలలో జాతీయ హరిత దళం (ఎన్జీసీ) ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నియంత్రణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Plastic Free Society | దీర్ఘకాలిక ముప్పు
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆర్. నర్సయ్య మాట్లాడుతూ.. నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన పర్యావరణ సమస్యల్లో ప్లాస్టిక్ కాలుష్యం ఒకటని అన్నారు. ఒక్కసారి వినియోగించి పారేసే ప్లాస్టిక్ సంచులు నేల, నీరు, గాలిని కలుషితం చేయడమే కాకుండా జీవవైవిధ్యానికి, పశుపక్ష్యాదులకు, మానవ ఆరోగ్యానికి దీర్ఘకాలిక ముప్పుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతి కుటుంబం తమ దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, షాపింగ్‌కు వెళ్లే సమయంలో వస్త్ర సంచులు, కాగితపు సంచులను ఉపయోగించే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు.
Plastic Free Society | విద్యార్థులు అవగాహన కల్పించాలి
పర్యావరణ పరిరక్షణలో చిన్నచిన్న మార్పులే గొప్ప ఫలితాలను అందిస్తాయన్నారు. తమ కుటుంబంతోపాటు సమాజంలో ప్లాస్టిక్ రహిత జీవన విధానంపై విద్యార్థులు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
అనంతరం ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, ప్రత్యామ్నాయాలపై విద్యార్థులు రూపొందించిన అవగాహన గోడపత్రాలను ప్రిన్సిపల్ ఆవిష్కరించి అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఎన్జీసీ ఇన్‌ఛార్జి ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.