అక్షరటుడే, వెబ్‌డెస్క్: Dharmapuri Arvind Students | నిజామాబాద్ జిల్లా సిరికొండలోని సత్యశోధక్ పాఠశాల విద్యార్థులు అబాకస్, వేదిక్ మ్యాథ్స్ విభాగాల్లో జాతీయ స్థాయిలో అసాధారణ ప్రతిభ కనబరిచి ఛాంపియన్లుగా నిలిచి అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావడం జిల్లాకే గర్వకారణమని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎం.పీ. ధర్మపురి అర్వింద్ అన్నారు.

Dharmapuri Arvind Students | అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం
నిజామాబాద్‌లోని తన కార్యాలయంలో విద్యార్థులు వి. సాద్వి, కె. రుగ్వేద, జి. అద్వైత్ రెడ్డిలను ప్రత్యేకంగా సత్కరించిన ఎంపీ అర్వింద్.. వారికి అవార్డులు, సర్టిఫికెట్లు, నగదు ప్రోత్సాహకాలను అందజేసి అభినందించారు.
గ్రామీణ ప్రాంతంలో చదువుతూ జాతీయ స్థాయి పోటీల్లో రాణించి అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకోవడం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

Dharmapuri Arvind Students | గ్రామీణ ప్రాంతాల్లో ప్రపంచ స్థాయి ప్రతిభ
విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా విజ్ఞానం, విలువలు, క్రమశిక్షణను అలవర్చుకుని మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కృషి, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఉంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రపంచ స్థాయి ప్రతిభ వెలుగులోకి వస్తుందనడానికి ఈ విద్యార్థులే నిదర్శనమని ఆయన అన్నారు.
ఇలాంటి ప్రతిభావంతులను తీర్చిదిద్దుతూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, పోటీ స్ఫూర్తిని పెంపొందిస్తున్న సత్యశోధక్ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులను ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఆర్. నర్సయ్య, ఉపాధ్యాయులు సతీష్ తదితరులు పాల్గొన్నారు.