అక్షరటుడే వెబ్‌డెస్క్: New Pension Beneficiaries | తెలంగాణ ( Telangana )రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీలో జరుగుతున్న అవకతవకలను అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన పరిశీలనలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాంకేతికత సహాయంతో నిర్వహించిన ‘లైఫ్ అథెంటికేషన్’ ప్రక్రియ ద్వారా, రాష్ట్రంలో సుమారు లక్ష మందికి పైగా అనర్హులు అక్రమంగా పెన్షన్లు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో మరణించిన వారి పేర్ల మీద కూడా కొందరు అక్రమార్కులు డబ్బులు డ్రా చేస్తున్నట్లు తేలడంతో, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ పేర్లను పెన్షన్ జాబితా నుంచి శాశ్వతంగా తొలగిస్తోంది.
New Pension Beneficiaries | కొత్తగా 3 లక్షల మందికి పెన్షన్ భరోసా..
అనర్హుల తొలగింపు ద్వారా మిగిలిన నిధులను నిజమైన లబ్ధిదారులకు పంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా దాదాపు 3 లక్షల మందికి పెన్షన్ సౌకర్యం కల్పించనున్నారు. ప్రస్తుతం అధికారులు 2 లక్షల మంది కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. తొలగించిన లక్ష మంది అనర్హుల స్థానంలో మరో లక్ష మంది అర్హులకు అవకాశం కల్పించనున్నారు. దీనికోసం ఆర్థిక శాఖ ఇప్పటికే నిధుల కేటాయింపు, లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది.
New Pension Beneficiaries | ఎవరికి ఊరట?
ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏళ్ల తరబడి పెన్షన్ కోసం నిరీక్షిస్తున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో పాటు గీత, చేనేత కార్మికులకు పెద్ద ఊరట లభించనుంది. త్వరలోనే అర్హుల తుది జాబితాను అధికారికంగా విడుదల చేసి, కొత్త వారికి పెన్షన్ల పంపిణీని ప్రారంభించనున్నట్లు సచివాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ చర్య వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, నిజమైన లబ్ధిదారులకు సకాలంలో సాయం అందుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: KTR Kaleshwaram Visit | కాళేశ్వరం సందర్శనకు బయలుదేరిన కేటీఆర్.. అడ్డుకుంటున్న పోలీసులు