అక్షరటుడే, డిచ్పల్లి: Kuwait Murder Case | ఎడారి దేశం కువైట్‌లో కనిపించకుండా పోయిన డిచ్పల్లి(Dichpally) మండలం కోరట్‌పల్లి తండా వాసి శవమయ్యాడు. అక్కడి సాల్మి ఏడారిలో(Salmi Desert) అతడిని పూడ్చిపెట్టిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Kuwait Murder Case | ఏడారిలో గుట్టుచప్పుడు కాకుండా..
కువైట్‌లోని సాల్మి ఎడారి ప్రాంతంలో హైవే పనుల నిమిత్తం మార్చి 19వ తేదీన వెళ్లిన యువకుడు గుగ్లోత్ కైలాష్(30) మరణించినట్లు కువైట్ దేశ పోలీసులు ప్రకటించారు. విషయాన్ని బయటకు రాకుండా ఉండేందుకు యజమాని, మరొకరి సహాయంతో మృతదేహాన్ని ఎడారిలోనే ఇసుకలో పాతిపెట్టారు. తర్వాత సదరు కార్మికుడు కైలాష్ కనిపించడం లేదంటూ పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.
Kuwait Murder Case | సీసీ పుటేజీ ఆధారంగా..
కువైట్‌లో మార్చి 19న ఈ ఘటన జరుగగా పోలీసులు కేసు నమోదు చేశారు. సుదీర్ఘంగా ఇన్వెస్టిగేషన్ చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీలను ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎడారి వైపు వెళ్లేటప్పుడు కారులో ఇద్దరు వెళ్లడం, తిరిగి వచ్చేటప్పుడు కేవలం ఒకరు మాత్రమే రావడంపై పోలీసులకు అనుమానం వచ్చింది. సీసీ పుటేజీలో నమోదైన వీడియో ఆధారాలతో కువైట్ పోలీసులు అక్కడే ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా… క్రేన్ ప్రమాదంలో అతడు (కైలాష్) చనిపోయాడని, భయంతో తాను, తన తండ్రి కలిసి కైలాష్ శవాన్ని అక్కడే పాతిపెట్టామని(Desert Burial) నేరం అంగీకరించాడు. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Kuwait Murder Case | నిందితుడిది డిచ్పల్లి మండలం సాంపల్లి
నిందితుడిది సైతం డిచ్పల్లి మండలం సాంపల్లి తండా పంచాయతీ పరిధిలోని ఓ తండా కావడం గమనార్హం. అయితే ఈ నేరంలో నిందితుడి తండ్రి కువైట్ దేశం విడిచి పారిపోయినట్లు అక్కడి ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు తెలిసింది. శవం పూడ్చి పెట్టిన కేసులో కువైట్ దేశం విడిచి స్వదేశానికి వచ్చిన వ్యక్తిపై మృతుడు కైలాష్ కుటుంబ సభ్యులు డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో(Dichpally police station) ఫిర్యాదు చేశారు. కువైట్‌లో నిందితుడు పట్టుబడినట్లు తెలుసుకున్న నిందితుడి తండ్రి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. దీంతో అతడిని పోలీసులు గాలిస్తున్నారు.
నాలుగు నెలలుగా కొడుకు కోసం ఎదురుచూపులు..
కువైట్‌లో శవమై తేలిన కైలాష్ డిచ్పల్లి మండలం కోరట్ పల్లి తండాకు చెందిన యువకుడు. గుగ్లోత్ గంగారం, యమున దంపతుల మొదటి సంతానం. కష్టపడి కైలాష్‌ను సివిల్ ఇంజినీరింగ్ చదివించారు. అయిదేళ్ల కిందట కైలాష్‌ను కువైట్ దేశానికి పంపించారు. అయితే మార్చి 19 తేదీన కైలాష్ తల్లిదండ్రులతో చివరిసారిగా మాట్లాడాడు. అటు తర్వాత కైలాష్ నుంచి ఎలాంటి ఫోన్ సమాచారం లేదు. కువైట్‌లో అక్కడ తెలిసిన వారితో మిస్సింగ్ కేసు నమోదు చేయించారు. సుమారు నాలుగు నెలలుగా కైలాష్ ఆచూకీ కోసం తల్లిదండ్రులు కంట్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా నిలుస్తాడని కొండంత ఆశతో కొడుకు కైలాష్ పై ఆశలు పెట్టుకున్నారు తల్లిదండ్రులు. అయితే అతడు మృతి చెందాడని తెలియడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. దీంతో కోరట్ పల్లి తండాలో విషాదం అలుముకుంది.
ఇది కూడా చదవండి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి నిధి అగర్వాల్