అక్షరటుడే, వెబ్డెస్క్ : SI Minor Driving | ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ.. ఇతరులకు ఆదర్శంగా నిలవాల్సిన ఓ ఎస్సై తన మనవరాలికి స్టీరింగ్ అప్పగించాడు. మైనర్ డ్రైవింగ్తో జరిగే అనర్థాలపై అవగాహన కల్పించాల్సిన ఆయన ఆరేళ్ల బాలికకు డ్రైవింగ్ నేర్పించడం గమనార్హం.
రంగారెడ్డి (Rangareddy) జిల్లాలో రద్దీగా ఉండే రోడ్డుపై ఓ ఎస్సై తన మనవరాలికి కారు నేర్పిస్తున్నాడు. ఆరేళ్ల చిన్నారిని డ్రైవింగ్ సీటులో కూర్చొపెట్టి ఆయన పక్కన కూర్చున్నాడు. దీంతో ఆ బాలిక కారు నడుపుతోంది. ప్రధాన రహదారిపై కారు నెమ్మదిగా, అడ్డదిడ్డంగా వెళ్లడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పలువురు వాహనదారులు వచ్చి చూసే సరికి బాలిక కారు నడుపుతోంది. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
SI Minor Driving | మా తాత ఎస్సై..
బాలిక కారు నడపడంపై అందులోని వ్యక్తిని వాహనదారులు ప్రశ్నించారు. దీంతో సదరు బాలిక వారిపై దురుసుగా మాట్లాడటం గమనార్హం. మా తాత ఎస్సై అని, కారు ఆపడానికి మీరెవరు అని సమాధానం ఇచ్చింది. తాము తప్పు చేసినా ఏం కాదనే భావన కొందరు అధికారులు, నాయకుల పిల్లల్లో ఉంటుంది. దానికి కారణం ఇలా పిల్లలను పెంచడమే అని పలువురు అంటున్నారు. ఆరేళ్ల బాలిక తన తాత ఎస్సై అని, ఎం చేసినా చెల్లుతుందని మాట్లాడటం ఇందుకు నిదర్శనం. సదరు ఎస్సై సైతం స్థానికులను దబాయించాడు. నా ఇష్టం, నన్ను అడగడానికి మీరెవరు అంటూ వారిపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడు.
SI Minor Driving | చర్యలు తీసుకుంటారా..
మైనర్లకు వాహనం ఇస్తే తల్లిదండ్రులకు జరిమానా, జైలుశిక్ష విధిస్తామని పోలీసులు నిత్యం ప్రచారం చేస్తుంటారు. అలాంటిది ఓ ఎస్సై నిబంధనలకు విరుద్ధంగా ఆరేళ్ల బాలికకు స్టీరింగ్ అప్పగించాడు. మరి ఆయనపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. కాగా సదరు వాహనంపై 2020 నుంచి చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. మొత్తం రూ.4010 పైన్ ఉంది. అయితే ఇతర వాహనదారుల నుంచి ముక్కుపిండి ఫైన్లు వసూలు చేసే పోలీసులు.. ఆ వాహనంపై ఆరేళ్లుగా జరిమానా వసూలు చేయకపోవడం గమనార్హం.
దీనిని కూడా చదవండి : Ferrari Car Crash | హైదరాబాద్లో ఫెరారీ కారు బీభత్సం