అక్షరటుడే వెబ్‌డెస్క్: Harish Rao BRS | తాను పార్టీ మారతానన్న ప్రచారానికి మాజీ మంత్రి హరీష్ రావు తెరదించారు. “నేను చొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చే రకం కాదు.. చచ్చే వరకు బీఆర్ఎస్లోనే ఉంటాను” అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తాను ఇప్పటికే వందసార్లు చెప్పానని ఆయన గుర్తు చేశారు.
Harish Rao BRS | ఈటల వ్యాఖ్యలతో సంబంధం లేదు..
ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటల రాజేందర్ ( Etela Rajender ) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన హరీష్ రావు, “ఈటలను కలిసి, మాట్లాడక చాలా సంవత్సరాలు అవుతోంది. ప్రాజెక్టుపై అవగాహనతో, గతంలో ఆ శాఖకు మంత్రిగా పనిచేశాడనే ఉద్దేశంతో ఆయన మాట్లాడి ఉండొచ్చు. ఆయన వేరే పార్టీ, నేను వేరే పార్టీ.. ప్రాజెక్టు గురించి మాట్లాడినంత మాత్రాన ఆయనతో నాకేంటి సంబంధం?” అని తేల్చి చెప్పారు.
Harish Rao BRS | రేవంత్ సర్కార్‌పై ఘాటు విమర్శలు..
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “రూ.50 లక్షల లంచం కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ రేవంత్ రెడ్డి. స్వయంగా ప్రధాని మోదీయే రేవంత్ రెడ్డి ‘ఆర్ఆర్ ట్యాక్స్’ వసూలు చేస్తున్నారని చెప్పారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు” అని విమర్శించారు. ఫైనాన్స్ బిల్లుల పేరుతో 12 శాతం వసూలు చేస్తున్నారని ఆరోపించిన ఆయన, కేంద్రం దీనిపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.
Harish Rao BRS | ప్రాజెక్టుపై ఈటల వైఖరి..
మరోవైపు, ఈటల రాజేందర్ ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపాయి. “భవిష్యత్తులో కరువు వచ్చే అవకాశం ఉంది.. కాళేశ్వరం ప్రాజెక్టును నింపాలి. బ్యారేజీలు దెబ్బతిన్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు” అని ఆయన చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: Harish Rao Statement | రైతుల కోసం రక్తం ఇవ్వడానికి సిద్ధం : హరీశ్ రావు