అక్షరటుడే వెబ్‌డెస్క్: West Bengal Terror Plot | పశ్చిమ బెంగాల్‌లో భారీ ఉగ్ర కుట్రను ఆ రాష్ట్ర పోలీసుల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) భగ్నం చేసింది. వర్ధమాన్‌లో అరెస్టయిన జైషే మహమ్మద్ అనుమానిత ఉగ్రవాది మహమ్మద్ హమీమ్ మోండల్ ప్రేయసి, సహచరి అయిన అర్పితా సర్కార్‌ను ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లో అదుపులోకి తీసుకున్న ఆమెను వర్ధమాన్‌కు తరలించారు. నిందితురాలు మోండల్‌తో వాట్సాప్ ద్వారా నిరంతరం టచ్‌లో ఉన్నట్లు డిజిటల్ ఆధారాలు లభించాయి.
West Bengal Terror Plot | హనీ ట్రాప్ ద్వారా సమాచారం సేకరణ..
పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ మద్దతుతో పనిచేస్తున్న ఈ నెట్‌వర్క్‌లో మోండల్ కీలక సభ్యుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో ఉగ్ర కార్యకలాపాలకు వేదిక సిద్ధం చేయడం, కొత్తవారిని చేర్చుకోవడంతో పాటు వీఐపీలపై నిఘా పెట్టడం ఇతని బాధ్యత. ఈ కుట్రలో భాగంగా అర్పితా సర్కార్‌ను ఉపయోగించి ‘హనీ ట్రాప్’ ద్వారా పశ్చిమ బెంగాల్‌లోని పలువురు కీలక రాజకీయ నాయకులు, వీఐపీల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినట్లు తేలింది.
West Bengal Terror Plot | సువేందు అధికారిపై ప్రత్యేక నిఘా..
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ( Suvendu Adhikari )కదలికలు, ఆయన కాన్వాయ్ ప్రయాణించే మార్గాలపై మోండల్ ప్రత్యేక నిఘా ఉంచినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. సేకరించిన సమాచారాన్ని భవిష్యత్తులో దాడుల కోసం ఉపయోగించాలని చూశారా అనే కోణంలో ఎస్టీఎఫ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలను విశ్లేషిస్తూ, ఈ కేసుకు అంతర్జాతీయ ఉగ్ర సంస్థలతో ఉన్న సంబంధాలపై విచారణను వేగవంతం చేశారు.
ఇది కూడా చదవండి: Banswada Stray Dogs | వీధి కుక్కల బెడదపై అధికారుల ప్రత్యేకచర్యలు