అక్షరటుడే వెబ్‌డెస్క్: Airfare Price Hike | విమానయాన సంస్థల టికెట్ ధరల పెంపుపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ( Supreme Court ), కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. సామాజిక కార్యకర్త లక్ష్మీనారాయణన్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది.
Airfare Price Hike | పిటిషనర్ ఆరోపణలు..
ప్రైవేట్ విమానయాన సంస్థలు ఏ నియమ నిబంధనలు లేకుండా ప్రయాణికుల నుంచి భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా పండుగ సీజన్లలో డిమాండ్‌ను సాకుగా చూపి అడ్డగోలుగా ధరలను పెంచుతున్నారని, దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని న్యాయవాది రవీంద్ర శ్రీవాస్తవ వాదించారు. ధరల విషయంలో పారదర్శకత లేదని, వీటిని నియంత్రించేందుకు ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
Airfare Price Hike | కోర్టు ఆదేశాలు..
కేంద్రం తరఫున హాజరైన న్యాయవాది, ప్రస్తుతం కొత్త చట్టం (భారతీయ వాయుయాన్ అధినియం-2024)కు సంబంధించి నిబంధనలు రూపొందుతున్నాయని, వీటిని త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉందని ధర్మాసనానికి వివరించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, రూపొందిస్తున్న నిబంధనలను రెండు వారాల్లోగా సీల్డ్ కవర్లో తమకు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: Shabad Murder Case | షాబాద్ ఆరుగురి హత్య కేసు.. నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య