Shabad Murder Case | షాబాద్‌ ఆరుగురి హత్య కేసు.. నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం దైవాలగూడ గ్రామంలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో ప్రధాన నిందితుడైన రాజ్‌కుమార్ చివరకు శవమై కనిపించాడు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Shabad Murder Case | రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం దైవాలగూడ గ్రామంలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో ప్రధాన నిందితుడైన రాజ్‌కుమార్ చివరకు శవమై కనిపించాడు. షాద్‌నగర్ నియోజకవర్గం, కొత్తూరు మండలం పంజర్ల గ్రామం శివారులో అతడి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది.

Shabad Murder Case | తప్పించుకోలేక ఆత్మహత్య..

హత్యలు జరిగినప్పటి నుంచి ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు 12 ప్రత్యేక బృందాలతో రాజ్‌కుమార్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 2 లక్షల నగదు బహుమతిని కూడా ప్రకటించారు. పోలీసుల గాలింపు ముమ్మరం కావడంతో ఎక్కడా ఆశ్రయం దొరకని రాజ్‌కుమార్, చివరికి తన మేనమామ ఊరైన పంజర్లకు చేరుకున్నాడు. అక్కడ శివారు ప్రాంతంలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలంలో పాయిజన్ బాటిల్ లభ్యమైంది.

Shabad Murder Case | కేసు నేపథ్యం..

తనపై పోక్సో కేసు నమోదు చేయించారనే కక్షతో రాజ్‌కుమార్.. కన్నబిడ్డలు, భార్యతో సహా తన కుటుంబంలోని ఆరుగురిని అత్యంత దారుణంగా నరికి చంపిన విషయం తెలిసిందే. ఈ దారుణం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నిందితుడు చనిపోవడంతో ఈ కేసు విచారణ ముగింపు దశకు చేరుకుంది.

Shabad Murder Case | పోలీసుల అప్రమత్తత..

రాజ్‌కుమార్ ఆత్మహత్య ఘటన తర్వాత, పంజర్ల గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.

 

ఇది కూడా చదవండి:  BRS Blood Donation | సీఎం రేవంత్ రెడ్డికి రక్తదానం.. బీఆర్ఎస్ నిరసనతో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *