అక్షరటుడే, కామారెడ్డి : Mobile Recovery | గడిచిన నెలరోజుల్లో రూ.21.76 లక్షల విలువైన ఫోన్లను రికవరీ చేశామని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మొబైల్స్ రికవరీ చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
Mobile Recovery | వ్యక్తిగత భద్రతకు ముప్పు
ఎస్పీ మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ కేవలం సమాచార సాధనం మాత్రమే కాదని, బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత ఫొటోలు, ముఖ్యమైన డేటా అన్నీ అందులో ఉంటాయన్నారు. అందుకే ఫోన్ పోవడం వల్ల వ్యక్తిగత భద్రత, గోప్యతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. బాధితులకు త్వరితంగా న్యాయం అందించే ఉద్దేశంతో ఇన్‌స్పెక్టర్ సంపత్ పర్యవేక్షణలో ఆర్‌ఎస్సై బాలరాజు, ఐదుగురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ బృందం ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ప్రతినెలా సగటున 100కు పైగా మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తోందని కొనియాడారు.
Mobile Recovery | ప్రత్యేక డ్రైవ్
గత 30 రోజుల్లో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో రూ.21.76 లక్షల రూపాయల విలువైన 136 ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని, ఈ ఏడాది ఇప్పటివరకు రూ.1.27 కోట్ల రూపాయల విలువైన 794 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు. గత ఏడాది రూ.3 కోట్ల విలువైన 1,834 ఫోన్లను బాధితులకు అప్పగించినట్లు గుర్తు చేశారు. సీఈఐఆర్ పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో ఇప్పటివరకు 5,075 మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి గుర్తించామని, వాటి విలువ సుమారు రూ.8.12 కోట్ల రూపాయలు ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. మొబైల్ రికవరీలో విశేష కృషి చేసిన ప్రత్యేక బృందాన్ని అభినందించారు.
మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ఆలస్యం చేయకుండా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, సిమ్ కార్డును వెంటనే బ్లాక్ చేయించాలని సూచించారు. పోయిన ఫోన్ల ద్వారా సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉన్నందున తెలియని లింకులు, అనుమానాస్పద కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రికవరీ అయిన మొబైల్ ఫోన్లను తీసుకోవాలనుకునే బాధితులు సంబంధిత ధ్రువపత్రాలతో జిల్లా పోలీసు కార్యాలయంలో ఆర్‌ఎస్‌ఐ బాలరాజును 8712686114 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Education Review | విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి: ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి