అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Municipality Scam | కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality)లో కాంట్రాక్ట్ బిల్లుల చెల్లింపులో భారీ అక్రమాలు జరుగుతున్నాయని కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు గురువారం ఫిర్యాదు చేశారు.
Kamareddy Municipality Scam | పర్సంటేజీలు తీసుకుని..
1వ వార్డ్ కౌన్సిలర్ గడ్డమీది మహేష్, 21వ వార్డ్ నాయకుడు తాటి ప్రసాద్, 14వ వార్డ్ నాయకుడు రాంశెట్టి భూపతి మున్సిపల్ ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, అకౌంటెంట్ రాములు బిల్లుల చెల్లింపులో కమిషన్, పర్సంటేజీలు తీసుకుంటున్నారని ఆరోపించారు. విజిలెన్స్ ఆరోపణలు ఉన్న బిల్లులను సైతం అధికారులు ఆమోదిస్తున్నారని ఆరోపించారు. మున్సిపాలిటీలో ఇష్టానుసారంగా అధికారులు బిల్లులు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎంవో ఎంఏ అండ్ యూడీ, హైదరాబాద్ చీఫ్ సెక్రటరీ మున్సిపల్, రాష్ట్ర విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్, సీడీఎంఏ డైరెక్టర్, కామారెడ్డి జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. శానిటేషన్, వాటర్ వర్క్స్, జనరల్ ఫండ్, 14వ, 15వ ఫైనాన్స్, స్పెషల్ డెవలప్‌మెంట్ నిధులతో చేపట్టిన పనుల బిల్లులపై సమగ్ర విచారణ చేపట్టాలని, విచారణ పూర్తయ్యే వరకు ఎటువంటి బిల్లులు చెల్లించవద్దని కోరారు.
Kamareddy Municipality Scam | మున్సిపాలిటీలో అనేక అక్రమాలు..
ఇప్పటికే కామారెడ్డి మున్సిపాలిటీలో ఫిబ్రవరి 16, 2026 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన గ్రాంట్లు, అభివృద్ధి నిధులు, ఇతర పథకాల నిధుల వినియోగంలో తీవ్ర అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. జరిగిన పనులకు, కొన్ని బిల్లులకు ఫోర్జరీ సంతకాలతో చెల్లింపులు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐదు నెలల క్రితం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడుల్లో ఒక ఫోర్జరీ వ్యవహారం బయటకు రావడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరింది. ఈ నేపథ్యంలో గత, ప్రస్తుత కాలంలో జరిగిన అన్ని బిల్లుల చెల్లింపులు, వర్క్ ఆర్డర్లు, ఎంబీ బుక్స్, సంబంధిత ఫైళ్లు, ఆమోద ప్రక్రియ, నిధుల వినియోగంపై సమగ్ర విచారణ జరపాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. కొందరు రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చి బిల్లులు మంజూరు చేయడం, ఇతరుల బిల్లులను పెండింగ్‌లో ఉంచడం జరుగుతోందని ఆరోపించారు. నకిలీ సంతకాలు, జరగని పనులకు బిల్లుల చెల్లింపు, నిధుల దుర్వినియోగం రుజువైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి..: Illegal Clinics Nizamabad | అనుమతి లేని క్లినిక్లపై వైద్యశాఖ దాడులు.. నాలుగు దవాఖానాలు సీజ్