అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao Power Cuts | రాష్ట్రంలో వ్యవసాయానికి 8 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో 8 గంటల కరెంట్ కూడా రావడంలేదని రైతులు సబ్ స్టేషన్లు ముట్టడించారన్నారు.
తెలంగాణ భవన్లో హరీశ్‌రావు (Harish Rao) మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని థర్మల్ పవర్ ప్లాంట్లలో 7 రోజులకు మించి బొగ్గు నిల్వలు లేవని తాము చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో బొగ్గు లేక 1&4 యూనిట్లలో 1600MW విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని పేర్కొన్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో 270MW విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈరోజు రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు ఏర్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao Power Cuts | చీకటి పాలన
కాంగ్రెస్ చెప్పుకునేది ప్రజాపాలన అని, చేసేది మాత్రం చీకటి పాలన అన్నారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, ఎగుమతి వివరాలు బీఆర్ఎస్ హయాంలో వెబ్సైట్లో ఉండేవని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో వివరాలు తీసేశారని తెలిపారు. నాణ్యమైన బొగ్గు ప్రైవేట్ వాళ్ళకు, ఇతర రాష్ట్రాలకు వెళ్తుందని ఆరోపించార.ఉ నాసిరకం బొగ్గు మనకు మిగులుతుందన్నారు. దీంతో థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుతుత్పత్తి ఆగిపోతుందని పేర్కొన్నారు. తెలంగాణకు 23 వేల మెగావాట్ల సామర్థ్యం ఉంటే కేవలం 14 వేల మెగావాట్ల లోడ్ ఉన్నా కూడా విద్యుత్ కోతలు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు.
Harish Rao Power Cuts | కరంటే ఉంటే వార్త
బొగ్గు లేదని విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసి, ప్రైవేట్ సంస్థల దగ్గర 80 మిలియన్ యూనిట్ల కరెంటును అధిక రేటుకు ఎందుకు కొంటున్నారని హరీశ్‌రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో కరెంట్ పోతే వార్త.. కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఉంటే వార్త అని ఎద్దేవా చేశారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.
ఇది కూడా చదవండి..: Sitarama Project | బీఆర్ఎస్ కక్ష కట్టి.. సీతారామ ప్రాజెక్టును గాలికి వదిలేశారు: మంత్రి పొంగులేటి