అక్షరటుడే వెబ్‌డెస్క్: Sitarama Project | ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని సరిగ్గా ఆదరించలేదనే కోపంతో, ఆ పార్టీ నేతలు అత్యంత కీలకమైన ‘సీతారామ ప్రాజెక్టు’తో పాటు అనేక నీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy )తీవ్రంగా విమర్శించారు. గురువారం (జులై 16 ) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి ఆయన సీతారామ ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గతాన్ని గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు.
Sitarama Project | ప్రజల కష్టాలను పట్టించుకోలేదు.
గతంలో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో బీఆర్ఎస్‌కు ఓట్లు వేయలేదనే కక్షతోనే ఆ ప్రాంతానికి ఎంతో అవసరమైన ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని మంత్రి ఆరోపించారు. పదేళ్ల పాలనలో ప్రజల కష్టాలను గుర్తించని వారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును చూసి జ్ఞానోదయం పొందాలని హితవు పలికారు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు విష ప్రచారాలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు.
Sitarama Project | తప్పులను సరిదిద్దుతూ ముందుకు..
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టులకు ఎలాగైతే మహర్దశ పట్టిందో, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వాటిని దశలవారీగా పూర్తి చేస్తున్నామని పొంగులేటి తెలిపారు. తాము ఎలాంటి భేషజాలకు పోకుండా, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతూ సీతారామ , కాళేశ్వరం ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తున్నామన్నారు.
Sitarama Project | ప్రాజెక్టు పురోగతి ఇలా..
గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై కేవలం 115 కోట్లు మాత్రమే ఖర్చు చేసి వదిలేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యతతో నిధులు విడుదల చేసిందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితి గురించి వివరిస్తూ, ప్రస్తుతం 1480 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాము. ఖమ్మం, వైరా, సత్తుపల్లి వంటి ప్రాంతాలకు తాగునీటిని అందిస్తున్నాము. 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ, కరువు నుంచి రైతులను కాపాడుతున్నాము. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించి, అదనపు నీటిని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి పొంగులేటి పునరుద్ఘాటించారు.
ఇది కూడా చదవండి: MLC Venkatram Reddy | నా కుమారుడు డ్రగ్స్ తీసుకోలేదు : ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి