అక్షరటుడే, కోటగిరి: Vikram-1 Success | గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన యువకుడు దేశం గర్వించదగ్గ స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యమయ్యాడు. అసాధారణ సాంకేతిక ప్రతిభతో ప్రైవేట్ రాకెట్ ప్రయోగంలో కీలకపాత్ర పోషించి ఇందూరు(Nizamabad) ఖ్యాతిని నింగికి దూసుకెళ్లేలా చేశాడు. కోటగిరికి (kotagiri) చెందిన మహాజన్ అఖిల్ ఈ ఘనత సాధించాడు.
Vikram-1 Success |రాకెట్ బృందంలో..
భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1విజయంలో కోటగిరి మండల కేంద్రానికి చెందిన మహాజన్ అఖిల్ పాలు పంచుకున్నాడు. మండలానికి చెందిన దివంగత మహాజన్ విఠల్ కుమారుడు మహాజన్ అఖిల్ హైదరాబాద్‌కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థలో ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. విక్రమ్-1 రాకెట్ తయారీ, ప్రయోగంలో ఆయన సాంకేతిక బృందంలో ఉన్నాడు. ఎంటెక్ పవర్ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేసిన అఖిల్ ఆరేళ్లపాటు డీఆర్డీవోలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా సేవలందించారు.
Vikram-1 Success |రక్షణ రంగంలో అనుభవంతో..
రక్షణ రంగంలో పొందిన అనుభవంతో ఆయన ప్రస్తుతం దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ కంపెనీలో ఇంజినీర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ తయారు చేసిన విక్రమ్-1రాకెట్ చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు రూపొందించబడింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ విజయం జిల్లా యువతకు స్ఫూర్తిగా నిలిచిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.