Gampa Govardhan Criticism | రైతులను పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Gampa Govardhan Criticism | రైతుల సమస్యలను పట్టించుకోకుండా, రైతులను అరిగోస పెడుతూ వారిని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) సమైక్య పాలనలోకి నెడుతుందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు.

Gampa Govardhan Criticism | రైతుల ఉసురు పోసుకుంటున్నారు..

రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి వారి ఉసురు పోసుకుంటోందని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. కేసీఆర్ (KCR) హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. గత సీజన్‌లో రైతులు ధాన్యం అమ్ముకునేందుకు అనేక ఇబ్బందులు పడ్డారని, కొనుగోలు కేంద్రాల్లో కాంటా అయిన ధాన్యం సైతం రైస్ మిల్లులకు వెళ్లలేని దుస్థితి నెలకొందని మండిపడ్డారు. రైతులు స్వయంగా రోడ్డెక్కి ధర్నాలు చేసినా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. అన్ని ప్రక్రియలు పూర్తయి రైస్ మిల్లుకు వెళ్లిన తర్వాత బస్తాకు 5 కిలోల చొప్పున కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే అగ్రగామిగా ఉన్న రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు.

Gampa Govardhan Criticism | తప్పించుకునే యత్నం..

రెండు రోజుల క్రితం మంత్రులతో జరిపిన సమావేశంలో కేంద్రం ఎంత కోటా ధాన్యం కొనుగోలు చేస్తుందో అంతే కొంటామని సీఎం చెప్పడం దారుణమన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రైతు దీక్షలో రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తే రైతులు పండించిన ఏ పంట అయినా కొనుగోలు చేయవచ్చని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు కేంద్రం చెప్పిన మాటే చెప్పడానికి సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందు ఎలాంటి వడ్లు పండించినా రూ.500 బోనస్ అని చెప్పి, ఇప్పుడు సన్నరకం వడ్లకేనని మాట మార్చారని, తాజాగా తక్కువ దిగుబడి వచ్చే 7 రకాల ధాన్యానికే బోనస్ ఇస్తామని చెప్పడం రైతులను దగా చేయడమేనని మండిపడ్డారు.  ఇది సన్న రకం వడ్లకు బోనస్ ఎగ్గొట్టేందుకు చేసే కుట్రలో భాగమేనని అన్నారు. సమైక్యాంధ్రలో తెలంగాణలో 1.30 కోట్ల ఎకరాల్లో ధాన్యం పండితే, కేసీఆర్ వచ్చాక అది 2.31 కోట్ల ఎకరాలకు చేరిందన్నారు.

Gampa Govardhan Criticism | దమ్ములేని ప్రభుత్వం..

గతంలో 24 గంటలు ఇచ్చిన విద్యుత్‌ను ఇప్పుడు 11 గంటలకు తగ్గించిన చేతకాని, చేవ చచ్చిన దమ్ములేని ప్రభుత్వమిదని గంప గోవర్ధన్​ (Gampa Govardhan) ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని 40వేల చెరువులకు మరమ్మతులు చేయించి వేల ఎకరాలను సాగులోకి తెచ్చిన ఘనత కేసీఆర్‌దేనని, ఒక సీఎం యజ్ఞంలా తలచుకుంటేనే ఇలాంటివి సాధ్యమవుతాయని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి, గోదావరి-కృష్ణా పారుతున్నా రాష్ట్రంలో నీళ్లు లేని పరిస్థితి కల్పించారని, రైతులను అప్పుల్లోకి నెట్టేసి ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ రైతు కల్లం మీద చనిపోతే పలకరించే దిక్కు లేదని, మంత్రులకు సమాధానం చెప్పే దమ్ము, రైతుల ముందుకు వచ్చి మాట్లాడే సత్తా లేదని విమర్శించారు. ప్రపంచ చరిత్రలోనే రైతుకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, 11 విడతల్లో రూ.72 వేల కోట్లు ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. గతంలో రైతు చనిపోతే ఒక్క పైసా ఇవ్వని ప్రభుత్వాలు ఉండగా, కేసీఆర్ వచ్చాక రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించారని గుర్తుచేశారు. ప్రస్తుత దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్రంలో 7,600 మంది రైతులకు రైతుబీమా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. రుణమాఫీ కింద కేసీఆర్ ప్రభుత్వం రూ.29వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసిందని తెలిపారు.

Gampa Govardhan Criticismv | రైతు భరోసా తగ్గించి.. అన్యాయం చేస్తున్నారు..

అధికారంలోకి రాకముందు ఎకరానికి రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని చెప్పి, రూ.12 వేలకు తగ్గించి మూడు విడతలు ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వమిదని మండిపడ్డారు. దుకాణాల్లో యూరియా లేకపోతే యాప్‌లలో ఎక్కడినుంచి వస్తుందని, ఎంతమంది రైతులు యాప్ తెలిసిన ఫోన్లు వాడుతున్నారని ప్రశ్నించారు. వెంటనే యూరియా యాప్‌ను ఎత్తివేసి గతంలో మాదిరిగా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ‘మోడీ బడేబాయ్.. తాను చోటాభాయ్’ అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి రెండున్నరేళ్లలో 71సార్లు ఢిల్లీ వెళ్లి బడేబాయ్‌తో రైతులకు ఉపయోగపడేది ఏం సాధించి తెచ్చారని నిలదీశారు. తన సొంత ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారని ఆరోపించారు. గత పదేళ్ల కాలంలో రైతాంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో రికార్డులే చెప్తాయని, పదేళ్ల పాలన ఒక చరిత్ర అని పేర్కొన్నారు.

Gampa Govardhan Criticism | ఉచిత విద్యుత్‌కు స్వస్తి పలికే కుట్ర

రాష్ట్రంలో కొత్తగా డిస్కంలు తెచ్చే యోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని, డిస్కంల పేరిట ప్రైవేటుకు అప్పగించి ఉచిత విద్యుత్‌కు స్వస్తి పలికే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించి ప్రభుత్వంపై తిరగబడాలని పిలుపునిచ్చారు. రైతాంగానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతు పలుకుతుందని, రైతు సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు వంచుతామని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ముందుకు సాగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కాసర్ల స్వామి, ప్రభాకర్ రెడ్డి, కో అప్షన్ సభ్యుడు కుంబాల రవి యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు ప్రభాకర్ యాదవ్, హఫీజ్ భేగ్, పిట్ల వేణు, గెరిగంటి లక్ష్మీనారాయణ, లోలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: NEET Exam Arrangements | జిల్లాలో ‘నీట్​’కు పక్కాగా ఏర్పాట్లు..

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *