అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | వర్షాకాలంలో నగరంలో ప్రజలకు ఇబ్బందులు ఉండవద్దని.. నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని పీసీసీ చీఫ్, శాసనమండలి సభ్యులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (MLC Mahesh Kumar Goud) సూచించారు. కలెక్టరేట్లో (Nizamabad) మంగళవారం ఆయన నగర అభివృద్ధిపై కలెక్టర్ ఇలా త్రిపాఠితో(Collector Ila Tripathi) కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Nizamabad City | ట్రాఫిక్ ఇబ్బందులు..
ట్రాఫిక్ ఇబ్బందులు, అభివృద్ధి పనులు, తాగునీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ పనులు తదితర అంశాలపై చర్చించి ఎమ్మెల్సీ సూచనలు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నగరంలోని అన్ని ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలన్నారు. అవసరమైన చోట వన్‌వే అమలు చేయాలని, యూ టర్న్‌ల వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రోడ్డు భద్రత నిబంధనలు పక్కగా పాటించేలా వాహన చోదకులకు అవగాహన కల్పిస్తూ.. ట్రాఫిక్ రూల్స్‌ను పక్కాగా అమలు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. కాగా.. ఆయా ప్రాంతాల్లో రోడ్లపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చివేయించాలని, రహదారులకు మరమ్మత్తులు చేయించాలని ఆదేశించారు.
Nizamabad City | వర్షాకాలంలో గుంతలు..
ప్రస్తుత వర్షాకాలంలో గుంతల వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున ఈ పనులకు తక్షణమే చేపట్టాలని ఎమ్మెల్సీ సూచించారు. శిథిలావస్థకు చేరిన పురాతన వాటర్ ట్యాంకులను కూల్చి వేయించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఫూలాంగ్ చౌరస్తా, ఓల్డ్ ఎల్ఐసీ చౌరస్తా తదితర ముఖ్య కూడళ్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులకు అవకాశం లేకుండా సర్కిళ్లను వెడల్పు చేయాలని అన్నారు. ప్రజల సౌకర్యార్థం చేపట్టిన సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ భవన సముదాయాల పనులను, కళాభారతి భవన నిర్మాణ పనులను వేగవంతం చేయించి యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేయించాలని సూచించారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ఎల్లమ్మ గుట్టలో మంచినీటి ట్యాంకును నిర్మించాలన్నారు.
Nizamabad City | అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు
రింగ్ రోడ్డు ప్రతిపాదనలు రూపొందించాలని, ఇంటింటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు వేగవంతంగా పూర్తి చేయాలని బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురి కాకుండా వాటి పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మేయర్ ఉమారాణి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా ఛైర్మన్ కేశ వేణు, అదనపు కలెక్టర్ భుజంగరావు, అదనపు డీసీపీ శుభం నగ్రాలే, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్వో గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : ఉస్మాన్‌సాగర్ సరస్సులో చిలుకూరు అర్చకుల వరుణ జపం