అక్షరటుడే, వెబ్డెస్క్ : Indiramma Towers Allocation | ఇందిరమ్మ టవర్స్ ఎల్ఐజీ గృహాల లక్కీ డ్రాలో ఎంపికైన అభ్యర్థుల్లో ఇప్పటివరకు 6,660 మంది అభ్యర్థుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గౌతమ్ తెలిపారు. మిగిలిన అభ్యర్థుల క్షేత్రస్థాయి పరిశీలనను కూడా ఈ వారంలోనే పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. అర్హులుగా నిర్ధారించబడిన లబ్ధిదారులకు ఈ వారంలోనే అధికారిక కేటాయింపు పత్రాలు జారీ చేస్తామన్నారు.
లక్కీ డ్రాలో ఎంపికైన అభ్యర్థులు తమకు ఇల్లు కేటాయించబడుతుందా లేదా అనే ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయి పరిశీలన మరియు అర్హత నిర్ధారణ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను ఆసరాగా చేసుకుని కొందరు బ్రోకర్లు, మధ్యవర్తులు ఇల్లు మంజూరు చేయిస్తామని, అధికారులతో మాట్లాడి సహాయం చేస్తామని చెబుతూ అమాయక లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.
Indiramma Towers Allocation | డబ్బులు ఇవ్వొద్దు
గృహాల కేటాయింపు ప్రక్రియలో బ్రోకర్లు, మధ్యవర్తులు లేదా ఇతర వ్యక్తులకు ఎలాంటి పాత్ర లేదని వైస్ ఛైర్మన్ గౌతమ్ అన్నారు. లబ్ధిదారులు ఎవరికీ లంచం, కమీషన్ లేదా ఇతర రూపంలో డబ్బులు చెల్లించవద్దని కోరారు. గృహాల కేటాయింపు పూర్తిగా ప్రభుత్వ నిబంధనలు, నిర్దేశించిన అర్హతలు, అధికారిక ప్రక్రియ ఆధారంగానే జరుగుతుందని స్పష్టం చేశారు. గృహానికి సంబంధించిన మొదటి విడత మొత్తాన్ని చెల్లించాల్సిన అధికారిక బ్యాంకు ఖాతా వివరాలు, చెల్లించాల్సిన మొత్తం, చెల్లింపు గడువు మరియు ఇతర సూచనలను కేటాయింపు పత్రంతోపాటే అధికారికంగా తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. కేటాయింపు పత్రంలో పేర్కొన్న అధికారిక బ్యాంకు ఖాతాకు మాత్రమే నిర్ణీత మొత్తాన్ని చెల్లించాలని సూచించారు.
దీనిని కూడా చదవండి : iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రో ప్రీ-బుకింగ్స్ షురూ.. క్రోమాలో ఐఫోన్ 17 ప్రోపై భారీ డిస్కౌంట్లు