Bahujan Awareness | బహుజన చైతన్యమే ఐక్యతకు మార్గం.. విద్యార్థులు, విద్యావంతులు కీలక పాత్ర పోషించాలి : PAAS

బుద్ధుడు, పులే, అంబేడ్కర్, కాన్షీరాం బోధనలు, ఆలోచనలు, ఉద్యమాలు, పోరాటాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత విద్యార్థులు, విద్యావంతులపై ఉందన్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bahujan Awareness | బహుజన విద్యార్థుల్లో చైతన్యాన్ని పెంపొందించి, బహుజనుల ఐక్యత కోసం విద్యార్థులు, విద్యావంతులు చురుకైన పాత్ర పోషించాలని పులే–అంబేడ్కర్ ఆలోచన సమితి అధ్యక్షులు, ఆర్థికవేత్త ప్రొఫెసర్ ఎం.ఏ. మాలిక్, డీఎస్పీగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన మదనం గంగాధర్ పిలుపునిచ్చారు.

బహుజనులు సంఘటితం కావడానికి బహుజన చైతన్యమే ప్రధాన మార్గమని వారు పేర్కొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన బహుజన విద్యార్థుల సదస్సులో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.

బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు పులే, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, కాన్షీరాం ఆశయాలకు అనుగుణంగా బహుజనులంతా ఐక్యమై సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల ఆధారంగా భారతీయ సమాజాన్ని నిర్మించడమే ముందున్న ప్రధాన లక్ష్యమని వారు అన్నారు.

Bahujan Awareness | ఆలోచనలు, ఉద్యమాలపై అవగాహన అవసరం

బహుజనులను సంఘటితం చేయాలంటే ముందుగా వారిలో సామాజిక, రాజకీయ చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఉందని మాలిక్, గంగాధర్ పేర్కొన్నారు. ఇందుకోసం బుద్ధుడు, పులే, అంబేడ్కర్, కాన్షీరాం బోధనలు, ఆలోచనలు, ఉద్యమాలు, పోరాటాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత విద్యార్థులు, విద్యావంతులపై ఉందన్నారు.

విద్యార్థులు కేవలం విద్యకే పరిమితం కాకుండా సమాజంలో నెలకొన్న అసమానతలు, సామాజిక సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

akshara today .jpgpaas 3

Bahujan Awareness | రిజర్వేషన్లపై చర్చ

భారతదేశంలో సుదీర్ఘకాలంగా వివక్ష, అణచివేత, అధికార దూరీకరణ, ఆర్థిక దోపిడీకి గురైన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించే ఉద్దేశంతో రాజ్యాంగం రిజర్వేషన్లను అందించిందని వారు వివరించారు. ఈ చారిత్రక, సామాజిక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా రిజర్వేషన్లను కేవలం ‘మెరిట్‌’ అంశంతో ముడిపెట్టడం సరికాదన్నారు.

Extramarital Dating Apps | వివాహేతర సంబంధాల యాప్‌ల వినియోగంలో హైదరాబాద్‌ టాప్‌–5లో..!

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేపట్టే ‘రిజర్వేషన్ల హటావో’ ఉద్యమానికి ప్రత్యామ్నాయంగా ‘క్యాస్ట్ హటావో’—కుల నిర్మూలన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న బహుజన విద్యార్థి సంఘం నాయకులను వారు అభినందించారు.

Bahujan Awareness | పుస్తక పఠనానికి పిలుపు

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రచించిన ‘కుల నిర్మూలన (Annihilation of Caste)’, మహాత్మా జ్యోతిరావు పులే రచించిన ‘గులాంగిరి’, అలాగే కాన్షీరాం ఆలోచనలు, ఉద్యమాలకు సంబంధించిన పుస్తకాలను విద్యార్థులు, విద్యావంతులు విస్తృతంగా చదవాలని వారు సూచించారు.

ఆ పుస్తకాల్లోని భావాలను అర్థం చేసుకుని వాటి సారాంశాన్ని బహుజనుల్లోకి తీసుకెళ్లాలని, తద్వారా సమానత్వం, సామాజిక న్యాయం, ఐక్యత ఆధారంగా సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Bahujan Awareness | EWS రిజర్వేషన్లపై ప్రశ్న

రిజర్వేషన్ల వల్ల మెరిట్‌ దెబ్బతింటుందని విమర్శించేవారు, ఆర్థికంగా బలహీన వర్గాలకు (EWS) 10 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు ఎందుకు మౌనం వహించారో ఆత్మపరిశీలన చేసుకోవాలని వారు ప్రశ్నించారు.

బహుజనులంతా ఐక్యమై భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా దేశ పాలనలో భాగస్వాములైనప్పుడు సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలకు మరింత సమర్థవంతమైన పరిష్కారాలు లభించే అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు. ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

akshara today .jpgpaas 2

పోస్టర్లు, కరపత్రాల విడుదల

సదస్సులో ఫూలే–అంబేడ్కర్ ఆలోచనల ప్రచారానికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం విద్యార్థులకు భారత రాజ్యాంగం ఒరిజినల్ ప్రతులను అందజేశారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *