అక్షరటుడే వెబ్‌డెస్క్: NEET Paper Leak | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారం పార్లమెంట్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గురువారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని ‘మకర్ ద్వార్’ వద్ద అధికార, ప్రతిపక్ష కూటముల ఎంపీలు ఎదురెదురుగా నిరసనలకు దిగడంతో గందరగోళ వాతావరణం నెలకొంది.
NEET Paper Leak | మకర్ ద్వార్ వద్ద ఉద్రిక్తత..
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ( Dharmendra Pradhan )తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘ఇండియా’ కూటమి ఎంపీలు ఆందోళన చేపట్టారు. అదే సమయంలో విపక్షాల తీరును నిరసిస్తూ ఎన్డీఏ ఎంపీలు కూడా అక్కడే నిరసనకు దిగారు. ఈ క్రమంలో సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ చేతిలోని ప్లకార్డును బీజేపీ ఎంపీ అరుణ్ సింగ్ బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. పరిస్థితి మరింత దిగజారకుండా పార్లమెంట్ భద్రతా సిబ్బంది అప్రమత్తమై ‘మానవ హారం’ (హ్యూమన్ చైన్)గా ఏర్పడి ఇరువర్గాల ఎంపీలను చెదరగొట్టారు. దీంతో అక్కడ భద్రతను భారీగా పెంచారు.
NEET Paper Leak | ఉభయ సభల్లోనూ గందరగోళం..
ఈ నిరసనల ప్రభావం ఉభయ సభలపై తీవ్రంగా పడింది. సభ ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. నీట్ వ్యవహారంపై సమగ్ర చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టడంతో సభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. సజావుగా నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో స్పీకర్ ఉభయ సభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Mutyam Venkataramana Remand | రూ.300 కోట్ల అక్రమాస్తులు.. డీఈ వెంకటరమణకు రిమాండ్