అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: SC Reservations | రాబోయే ఎన్నికల్లో దళిత అభ్యర్థులకు జనాభా నిష్పత్తికి అనుగుణంగా 15 శాతం రాజకీయ రిజర్వేషన్లు కేటాయించాలని తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చా ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు.
SC Reservations | నాటి విధానమే కొనసాగించాలి..
బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పోతుల పురుషోత్తం మాట్లాడుతూ.. 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) ఎస్సీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేసిందని, రాబోయే ఎన్నికల్లోనూ అదే విధంగా ఎస్సీ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు వర్తింపజేయాలని కోరారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో అమలు చేస్తున్న రీతిలోనే రాజకీయ రంగంలోనూ ఎస్సీలకు 15శాతం రిజర్వేషన్లు కేటాయించాలని, ఈ విధానాన్ని తెలంగాణ రాష్ట్రమంతటా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
SC Reservations | సామాజిక న్యాయం సాధించడమే లక్ష్యం..
రాజ్యాంగం నిర్దేశించిన సామాజిక న్యాయం, సమానత్వం, బలహీన వర్గాల సాధికారత లభించాలంటే స్థానిక ప్రాతినిధ్యం అత్యంత కీలకమని పురుషోత్తం అన్నారు. దళితులకు తగినంత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించినప్పుడే వారి సమస్యలు ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్తాయని పేర్కొన్నారు. కాబట్టి రాబోయే అన్ని ఎన్నికల్లో దళితులకు 15శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ఎస్సీ మోర్చా నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Government Schools | సర్కారు వర్సెస్ ప్రైవేటు స్కూళ్లు.. సందిగ్ధంలో విద్యార్థుల తల్లిదండ్రులు..