అక్షరటుడే, కామారెడ్డి : Government Junior College | ప్రభుత్వ కళాశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా.. ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. కాలేజీల్లో విద్యార్థులకు సరిపడ వసతులు ఉండటం లేదు. ప్రభుత్వ కాలేజీల్లో చేరాలని ప్రచారం చేస్తున్నా నాయకులు, అధికారులు వసతుల కల్పనపై దృష్టి పెట్టడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
కామారెడ్డి (Kamareddy) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరిస్థితి రోజురోజుకూ చెప్పుకోలేని స్థితికి చేరుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి, నాయకుల పట్టింపులేని తనానికి ఈ కళాశాల నిదర్శనంగా మారింది. వెయ్యి మంది విద్యార్థుల అవసరాలకు తగినట్టుగా 9 కోర్సులు ఉంటే ఉన్నది మాత్రం కేవలం 10 తరగతి గదులే కావడం గమనార్హం. గదులు సరిపోకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెట్ల కింద, వరండాల్లో క్లాసులు వింటున్నారు. దీంతో కాలేజీ యాజమాన్యం తప్పనిసరి పరిస్థితుల్లో సరికొత్త విధానానికి తెర తీసింది.
Government Junior College | రెండు బ్యాచ్‌లుగా..
విద్యార్థుల తాకిడి పెరగడం, గదులు సరిపోకపోవడంతో కళాశాల యాజమాన్యం షిఫ్టింగ్ సిస్టమ్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఒక బ్యాచ్ విద్యార్థులకు, మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరో బ్యాచ్ విద్యార్థులకు తరగతులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను ఉన్నతాధికారులకు పంపడంతో ఆమోదం కూడా లభించినట్టు తెలుస్తోంది.
Government Junior College | సరిపోని తరగతి గదులు
ఈ కళాశాలకు జిల్లాలోనే మంచి డిమాండ్ ఉంది. అధ్యాపకులు మెరుగ్గా బోధించడంతో ప్రతి ఏటా అడ్మిషన్లు పెరుగుతున్నాయి. గత ఏడాది 600 మంది ఉంటే, ఈ ఏడాది ఆ సంఖ్య వెయ్యికి చేరింది. విద్యార్థులకు సరిపడా గదులు లేవు. దీనిపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో చెట్ల కింద, వరండాలో, ల్యాబ్ రూముల్లోనే పాఠాలు సాగుతున్నాయి. ఒక గదిలో 60 మందికి బదులు 100 మందిని కూర్చోబెడుతున్నారు. బెంచీలు లేక చాలామంది కింద కూర్చుండి పాఠాలు వింటున్న దుస్థితి నెలకొంది.
Government Junior College | ఆసక్తి సన్నగిల్లే అవకాశం
యాజమాన్యం తీసుకొచ్చిన షిఫ్టుల విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం చదివే విద్యార్థులకు పర్వాలేదు కానీ, మధ్యాహ్నం వచ్చే విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంటుందని అంటున్నారు. ఎటు కాని సమయంలో వచ్చి చదవాలంటే ఏకాగ్రత ఉండదని, హాజరు శాతం కూడా గణనీయంగా పడిపోతుందని అధ్యాపకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బాలికలు మధ్యాహ్నం షిఫ్ట్ కు రావడానికి ఇబ్బందులు పడతారని, దీంతో డ్రాప్ అవుట్స్ పెరిగే ప్రమాదం పలువురు పేర్కొంటున్నారు. అదనపు గదులు నిర్మించి విద్యార్థుల ఇబ్బందులు పరిష్కరించాలని కోరుతున్నారు.
Government Junior College | పట్టించుకోని నాయకులు..
కళాశాలలో నెలకొన్న వసతుల కొరతపై ఈ మధ్య విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. విద్యార్థులతో కలిసి నాయకులు కలిసి రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. అదనపు తరగతి గదులు నిర్మించాలని, వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అయినా జిల్లా నాయకులు, అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రతిపాదనలు పంపామని, నిధులు రాగానే పనులు మొదలుపెడతామని మొక్కుబడి సమాధానం చెబుతున్నారే తప్ప ఆచరణలో చర్యలు శూన్యం. పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ కళాశాలపై ప్రభుత్వం చిన్నచూపు చూడటం సరికాదని, వెంటనే స్పందించి అదనపు గదులు నిర్మించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
Government Junior College | ప్రిన్సిపల్ అభ్యర్థన మేరకే..
– సలాం, ఇంటర్ నోడల్ ఆఫీసర్
కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గదుల కొరత ఉంది. దాంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్య పరిష్కారం కోసం షిఫ్టింగ్ పద్ధతిలో క్లాసుల నిర్వహణకు కళాశాల ప్రిన్సిపాల్ లేఖ రాశారు. ఆమె అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నాలుగైదు నెలలు మాత్రమే షిఫ్టింగ్ క్లాసులు జరుగుతాయి. ఆ లోపు అదనపు గదులు మంజూరు వస్తాయి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
ఇది కూడా చదవండి..: Banswada Student Death | బాన్సువాడలో ఘోరం.. లారీ ఢీకొని విద్యార్థిని మృతి