Siddaramaiah Retirement | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా: సిద్ధరామయ్య

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రత్యక్ష రాజకీయ పోటీకి దూరంగా ఉంటానని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Siddaramaiah Retirement | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రత్యక్ష రాజకీయ పోటీకి దూరంగా ఉంటానని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య  ప్రకటించారు. మండ్య జిల్లా కేఆర్ పేటలో నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. వయస్సు, ఆరోగ్య సమస్యలు , రాజకీయాల్లో పెరుగుతున్న విపరీతమైన అవినీతిని తన నిర్ణయానికి ప్రధాన కారణాలుగా ఆయన పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తనకు సుమారు 82 సంవత్సరాలు వస్తాయని, అప్పుడు మునుపటిలా చురుగ్గా, శక్తితో పనిచేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రజా జీవితంలో మాత్రం కొనసాగుతూ, ప్రజల కష్టసుఖాల్లో వారికి ఎప్పుడూ అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.

Siddaramaiah Retirement |సిద్ధాంతాల విషయంలో రాజీపడలేదని..

తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ.. 1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా ప్రజా జీవితంలోకి ప్రవేశించిన తాను, 2028 నాటికి రాజకీయాల్లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటానని తెలిపారు. తన రాజకీయ ప్రస్థానంలో విజయాలు, అపజయాలు చూశానని, అయితే ఎప్పుడూ సిద్ధాంతాల విషయంలో రాజీపడలేదని, మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించలేదని సంతృప్తి వ్యక్తం చేశారు.

Siddaramaiah Retirement | రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం..

రాజకీయాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఒకప్పుడు ఎన్నికల సమయంలో ప్రజలే అభ్యర్థులకు విరాళాలు ఇచ్చి మద్దతుగా నిలిచేవారని, కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలంటే అభ్యర్థులు ఓటర్లకు విరివిగా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని, రాజకీయాలు తీవ్రంగా అవినీతిమయమైపోయాయని, నిజాయితీ రాజకీయాలకు చోటు లేకుండా పోయిందని విమర్శించారు. తన సొంత నియోజకవర్గమైన వరుణ ప్రజలు మళ్లీ పోటీ చేయాలని కోరుతున్నప్పటికీ, మరోసారి ఎన్నికల బరిలోకి దిగకూడదని కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పునరుద్ఘాటించారు. కాగా, ఇటీవలే కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగి, తన డిప్యూటీ డీకే శివకుమార్‌కు బాధ్యతలు అప్పగించిన కొద్ది నెలల వ్యవధిలోనే సిద్ధరామయ్య ఈ ప్రకటన చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: Assembly Age Limit | పోటీ వయస్సు 21 ఏళ్లకు తగ్గింపు .. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతామన్న సీఎం రేవంత్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *