అక్షరటుడే, వెబ్డెస్క్ : Adilabad Airport | ఆదిలాబాద్ (Adilabad) ఎయిర్పోర్టుకు భూ సేకరణ కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.2,278.14 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది. డిసెంబర్ నాటికి భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించింది.
ఆదిలాబాద్ ఎయిర్పోర్టులో 2,009.23 ఎకరాల్లో ఎయిర్ఫీల్డ్, సివిల్ ఏవియేషన్, కార్గో, ఎంఆర్ఓ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komatireddy Venkat Reddy) తెలిపారు. ఏర్పాటుతో వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. నిధుల మంజూరుతో ఉత్తర తెలంగాణ అభివృద్ధికి మరో కీలక అడుగు పడిందని తెలిపారు.
Adilabad Airport | అనుబంధ పనులకు కూడా..
ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 2,009.23 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. 1,609.23 ఎకరాలు భారత వైమానిక దళం (IAF) అవసరాల కోసం, 400 ఎకరాలు సివిల్ ఏవియేషన్ ఎన్క్లేవ్, ఎంఆర్ఓ (MRO), కార్గో టెర్మినల్, హ్యాంగర్లు, భవిష్యత్ విస్తరణ అవసరాల కోసం కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న రహదారుల మళ్లింపు, 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ల తరలింపు, వాగుల మళ్లింపు, మిషన్ భగీరథ తాగునీటి పైప్లైన్ల మార్పు, విద్యుత్ స్తంభాల తొలగింపు వంటి అన్ని అనుబంధ పనులకు అవసరమైన నిధులను కూడా కేటాయించినట్లు వివరించారు.
Adilabad Airport | ఉత్తర తెలంగాణ అభివృద్ధి
ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ రాష్ట్రానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాజెక్టు అని కోమటిరెడ్డి పేర్కొన్నారు. భారత వైమానిక దళం, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేస్తున్నాయి. విమానాశ్రయంతో ఉత్తర తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, కార్గో రవాణా, పర్యాటకం, రక్షణ రంగాలకు విశేష ఊతం లభించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు.
దీనిని కూడా చదవండి : Exam Reforms Task Force | పరీక్షల సంస్కరణకు టాస్క్ఫోర్స్.. మరో వీడియో విడుదల చేసిన మోదీ