Panchayat Audit | అడ్డగోలుగా ‘ఆడిట్​’..

గ్రామస్థాయి పాలనలో పారదర్శకత పెంచేందుకు, జీపీలకు వచ్చే గ్రాంట్ల పక్కదారి పట్టకుండే చూసే ‘ఆడిటింగ్​’ మామూళ్లకు కేరాఫ్​ అడ్రస్​గా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Panchayat Audit | గ్రామస్థాయి పాలనలో పారదర్శకత పెంచేందుకు, జీపీలకు వచ్చే గ్రాంట్లు పక్కదారి పట్టకుండే చూసే ‘ఆడిటింగ్​’ మామూళ్లకు కేరాఫ్​ అడ్రస్​గా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో కొత్తగా ఏర్పడిన పంచాయతీ పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొదటి విడత ఆడిట్ ఒక పెద్ద ప్రహసనంగా మారిందని ప్రచారం సాగుతోంది.

Panchayat Audit | ప్రజాధనం దుర్వినియోగం కాకుండా..

ప్రజల పన్నుల రూపంలోనూ, ప్రభుత్వం అందించే వివిధ రకాల గ్రాంట్ల (ఆర్థిక సంఘం, ఎస్‌ఎఫ్‌సి తదితర) రూపంలో వచ్చే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు రూపొందించిన వ్యవస్థ ‘ఆడిటింగ్’ (లెక్కల తనిఖీ). కానీ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లోని గ్రామ పంచాయతీల్లో సాగుతున్న ఆడిటింగ్ సరళిని చూస్తే చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారనే అనుమానాలు వస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పడిన పంచాయతీ పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొదటి విడత ఆడిట్ ఒక పెద్ద ప్రహసనంగా మారింది. నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో అంగుళం అంగుళం తనిఖీ చేయాల్సిన ఆడిట్ అధికారులు, గది దాటి బయటకు రావడం లేదు. అంతా ‘మామూలు’ వ్యవహారంగా మార్చేసి, ఆడిట్‌ను చుట్టేస్తున్నారు.

Panchayat Audit | నిబంధనలు ఇలా..

ఆడిటింగ్ అనేది కేవలం కాగితాలపై సంతకాలు చేసే ప్రక్రియ కాదు. ‘స్టేట్ ఆడిట్ చట్టం’, ‘తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం’.. ప్రకారం ఒక గ్రామ పంచాయతీకి ఆడిట్ అధికారులు వచ్చినప్పుడు నిబంధనలు పాటించాలి. ఆడిట్ టీమ్ తప్పనిసరిగా సదరు గ్రామ పంచాయతీ కార్యాలయానికే వెళ్లాలి. పంచాయతీ పరిధిలో జరిగిన పనులను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించాలి. వేసిన రోడ్డు మందం ఎంత..? నాణ్యత ఎలా ఉంది? ఉపయోగించిన సామగ్రికి సరిపడా బిల్లులు ఉన్నాయా? అని చూడాల్సి ఉంటుంది.

Panchayat Audit | రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించాలి..

పంచాయతీ క్యాష్ బుక్, పాస్ పుస్తకాలు, వోచర్లు, ఎం-బుక్స్ (మెజర్మెంట్ బుక్స్)లను నిశితంగా సరిపోల్చాలి. ఆస్తి పన్ను వసూళ్లు, నల్లా పన్నులు, పంచాయతీకి వచ్చిన ఇతర ఆదాయాలు సరిగ్గా జమ అయ్యాయా.? లేదా అని చూడాలి. అవసరమైతే గ్రామంలో స్థానికులను అడిగి, పనులు నిజంగానే జరిగాయా లేదా ‘కాగితాలకే పరిమితమయ్యాయా’ అనేది నిర్ధారించుకోవాలి. ఏవైనా తేడాలు, నిధుల దుర్వినియోగం కనిపిస్తే తక్షణమే ‘ఆడిట్ ఆబ్జెక్షన్’ నమోదు చేసి, సంబంధిత సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిల నుండి సమాధానం తీసుకోవాలి.

Panchayat Audit | క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?

జిల్లాలోని పలు మండలాల్లో ఈ నెలలో ఆడిట్ ప్రారంభమైంది. నిబంధనల్ని పాతర వేసి ఆడిట్ చేస్తున్నట్లు తీవ్ర విమర్శలు నెలకొన్నాయి. ఓ మండల కేంద్రంలోని ఏదైనా ఒక పెద్ద గ్రామ పంచాయతీ భవనంలో ఆడిట్ అధికారులు కూర్చుని చుట్టుపక్కల ఉండే 8 నుంచి 10 గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు ఫోన్లు చేసి సమాచారం తెప్పించుకుంటున్నారు. ‘ఫలానా ఆఫీసులో ఉన్నాము.. మీ జీపీ రికార్డులు తీసుకురండి..’ అని ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పంచాయతీ కార్యదర్శులు సైతం కార్లు, బైక్‌లపై రికార్డుల మూటలను వేసుకుని అధికారులు ఉన్న చోటికే పరుగులు తీస్తున్నారని సమాచారం.

Panchayat Audit | కాగితాలు దాటని కన్ను..

ఒకే గదిలో కూర్చుని పదుల సంఖ్యలో ఉన్న పంచాయతీల రికార్డులను గంటల వ్యవధిలోనే పరిశీలించేస్తున్నారు. అక్కడ జరిగిన పనులేంటి..? వేసిన రోడ్లు ఉన్నాయా, కొట్టుకుపోయాయా..? నాటిన మొక్కలు బతికాయా లేదా? అనే ప్రాథమిక స్పృహ లేకుండా కేవలం బిల్లుల వెనుక సంతకాలు పెట్టేసి మమ అనిపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Panchayat Audit | కోరిన భోజనం.. నజరానాలు..

ఆడిట్ చేసేందుకు వచ్చిన అధికారులకు సర్పంచులు, కార్యదర్శులు రాజభోగాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆడిటింగ్ జరుగుతున్న రోజుల్లో అధికారుల భోజనం బాధ్యత అంతా సర్పంచులదే. విందులతో పాటు, రికార్డుల్లో ఏవైనా తప్పులున్నా, నిధుల వినియోగంలో అక్రమాలున్నా బయటపడకుండా ఉండేందుకు ఆడిట్ అధికారులకు పంచాయతీ స్థాయిని బట్టి నగదు ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. డబ్బులు, విందులు అందిన వెంటనే ఆడిట్ అధికారులు రికార్డులన్నింటికీ ‘ఆల్ ఈజ్ వెల్’ అంటూ క్లీన్​చిట్ ఇచ్చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎలాంటి అభ్యంతరాలు రాకుండా, లోపాలున్నా వాటిని కప్పిపుచ్చి ఆడిట్ నివేదికలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Panchayat Audit | ఆకస్మిక తనిఖీలు అవసరం

జిల్లా ఆడిట్ అధికారి, జిల్లా కలెక్టర్ స్వయంగా ఆడిట్ జరుగుతున్న ప్రదేశాలను, అలాగే ఆడిట్ పూర్తయిన గ్రామాలు కొన్నింటిని ఆకస్మికంగా తనిఖీ చేస్తే అసలు విషయం తెలుస్తుందనే డిమాండ్ ఉంది. ఆడిట్ అధికారులు తప్పనిసరిగా సదరు పంచాయతీకి వెళ్లినట్లు జియో-ట్యాగింగ్ ఫొటోలు, పంచాయతీ సమక్షంలో తీసిన వీడియో ఆధారాలను సమర్పించేలా నిబంధనలు కఠినతరం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గాంధీజీ కలల ప్రకారం గ్రామ స్వరాజ్యం సిద్ధించాలంటే గ్రామ పంచాయతీలు పారదర్శకంగా పనిచేయాలి. నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా సాగుతున్న ఈ ప్రహసన ఆడిటింగ్‌పై జిల్లా యంత్రాంగం, పంచాయతీ రాజ్ శాఖ తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. నిబంధనలను కాగితాలకే పరిమితం చేయకుండా, అక్రమార్కుల గుండెల్లో నిద్రపోయేలా నిజమైన ఆడిటింగ్ జరిగేలా చూడాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.

ఇది కూడా చదవండి..: MP Arvind | విద్యార్థులను మోసం చేస్తున్న ప్రభుత్వం : ఎంపీ అర్వింద్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *