అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: School Pending Works | ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపర్చేందుకు వీలుగా చేపట్టిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) సూచించారు. కలెక్టరేట్లో కలెక్టర్ భవేష్ మిశ్రాతో(Collector Bhavesh Mishra) కలిసి వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు.
School Pending Works | పెండింగ్ పనులు..
వివిధ పాఠశాలల్లో పెండింగ్ లో ఉన్న అసంపూర్తి పనులను గుర్తించి, విద్యార్థులు సంఖ్య, స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యతా క్రమంలో చేపట్టి పూర్తి చేయాలని అధికారులకు సుదర్శన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎక్కడ కూడా తాగునీరు, టాయిలెట్స్ వంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. విద్యార్థులు ప్రయోజనాల విషయంలో ఎంతమాత్రం రాజీ పడకూడదని, నూటికి నూరు శాతం పనులు నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని అధికారులకు సూచించారు. పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల విషయమై ఉన్నతాధికారులను సంప్రదించి మంజూరు చేయిస్తానని తెలిపారు. అయితే పనులను పూర్తి చేయించే విషయంలో నిర్లక్ష్యం వహించకుండా, విద్యార్థులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని హితవు పలికారు.
School Pending Works | మిల్లర్లపై ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగించాలి
పౌర సరఫరాల శాఖ పనితీరును సమీక్షిస్తూ, డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై చేపట్టిన చర్యల గురించి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎంతమంది నుండి ఏమేరకు బకాయిలు రాబట్టగలిగారు. ఇంకా ఎంత మంది సీఎంఆర్‌కు సంబంధించిన బకాయిలు చెల్లించేందుకు సముఖంగా ఉన్నారనే వివరాలు తెలుసుకున్నారు. బకాయిలు చెల్లించని మిల్లర్లకు నోటీసులు జారీచేసి, రెవెన్యూ రికవరీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
పంచాయతీ శాఖ పనితీరును సమీక్షిస్తూ, ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్యం పనులు, తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా రోజువారీగా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే పంచాయతీ కార్యదర్శులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. నగర పాలక సంస్థ పరిధిలోనూ ఇంటింటి చెత్తను వెంటదివెంట తరలించేందుకు వీలుగా డంపింగ్ యార్డ్ మల్టిపుల్ పాయింట్స్‌ను ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్‌కు సూచించారు. సమీక్ష సమావేశంలో జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, డీఎస్వో శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్, డీఈవోపీ అశోక్, డీపీవో శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.